ప్రధాని మోడీతోపాటు బీజేపీ అగ్రనేతలపై కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీతో ఢీ అంటే ఢీ అనే రీతిలో అమీతుమీకి సిద్ధమైన కేసీఆర్..మరోసారి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే మోడీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బీహార్ సీఎం నితీశ్ కుమార్ తో కేసీఆర్ భేటీ కాబోతుండడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
గాల్వాన్ లోయ ఘర్షణలో అమరులైన ఐదుగురు సైనికుల కుటుంబాలకు కేసీఆర్ ఆర్థిక సాయం అందించనున్నారు. సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో చనిపోయిన 12 మంది బిహార్ వలస కార్మికుల కుటుంబాలను కూడా పరామర్శించి వారికి ఆర్థిక సాయం అందించబోతున్నారు కేసీఆర్. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం తర్వాత నితీశ్, కేసీఆర్ ల మధ్య కీలక భేటీ జరగనుంది. దేశంలోని తాజా రాజకీయ పరిణామాలు, 2024 సార్వత్రిక ఎన్నికలపై కేసీఆర్, నితీశ్ లు చర్చించే అవకాశం కనిపిస్తోంది.
ఇటీవల ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన నితీశ్ తో కేసీఆర్ భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు చేసి ఆ పార్టీ ఓటమే లక్ష్యంగా కేసీఆర్ దేశంలోని పలు రాష్ట్రాలలో పర్యటించనున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, తమిళనాడు సీఎం స్టాలిన్‌తో పలుమార్లు కేసీఆర్ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా బిహార్ సీఎం నితీశ్ తో కూడా కేసీఆర్ భేటీ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో థర్డ్ ఫ్రంట్‌పై కేసీర్ ఎలాంటి ప్రకటన చేయబోతున్నారో అన్న ఆసక్తి ఏర్పడింది. బీజేపీ, కాంగ్రెసేతర కూటమిని ఈ సారి ఢిల్లీ గద్దెపై నిలిపేందుకు కేసీఆర్ అడుగులు వేస్తున్నారు.