అప్పుచేసి పప్పు కూడు తినరా ఓ నరుడా!! అంటూ.. పాత సినిమాలో పాట కొన్ని దశాబ్దాల పాటు తెలుగు నేలపై వినిపించింది. తర్వాత.. ఇది వినిపించలేదు. వాస్తవానికి ఇది వ్యక్తుల కోసం.. డాంబికాల కోసే రుణాల కోసం హెచ్చరికగా సీనియర్ సముద్రాల వారు రాసిన సామాజిక నేపథ్యం ఉన్న గీతం. అయితే..ఇప్పుడు ఈ పాట ఏపీకి పూర్తిగా అన్వయం అవుతోందని అంటున్నారు పరిశీలకులు.
అప్పులు చేయుట ఎందుకురా? అని అడిగితే.. ప్రజలకు పంచేటందుకురా!! అని అధికార పార్టీ నాయకులు తడుముకోకుండా చెప్పేస్తున్నారు. దీంతో 2019 తర్వాత నుంచి ఏపీ అప్పులు ఆకాశం కాదు.. అంతరిక్షమే హద్దుగా దూసుకుపోతున్నాయని కేంద్ర ప్రభుత్వం తాజాగా కుండబద్దలు కొట్టింది.
ఏపీ అప్పుల భారం పెరుగుతోందని కేంద్రం నివేదించింది. దేశంలోని రాష్ట్రాల వారీగా అప్పుల జాబితాను కేంద్రం బయటపెట్టింది. ఏపీలో ఏటేటా అప్పులు భారీగా పెరిగినట్టు పేర్కొంది. బడ్జెట్ లెక్కల ప్రకారం 2018లో ఏపీ అప్పు రూ.2.29 లక్షల కోట్లుగా ఉండగా.. ప్రస్తుతం ఆ రుణం రూ.3.98 లక్షల కోట్లకు చేరిందని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది.
అదే 2017-18లో గతంతో పోలిస్తే 9.8శాతం అప్పులు తగ్గాయని కేంద్రం పేర్కొంది. 2020-21 నాటికి అప్పులు 17.1శాతం పెరుగుదల నమోదైనట్టు తెలిపింది. ఏపీ జీడీపీలోనూ మూడేళ్లుగా అప్పుల శాతం పెరిగినట్టు వెల్లడించింది. 2014లో రాష్ట్ర జీడీపీలో అప్పుల శాతం 42.3శాతంగా ఉన్నట్టు పేర్కొన్న కేంద్ర ఆర్థికశాఖ.. 2014 తర్వాత రాష్ట్ర జీడీపీలో అప్పుల శాతం తగ్గిందని తెలిపింది. 2015లో రాష్ట్ర జీడీపీలో 23.3శాతం అప్పులు ఉండగా.. 2021 నాటికి అది 36.5శాతానికి పెరిగినట్టు వెల్లడించింది.
రాష్ట్ర పాలకులు తరచుగా అప్పులపై చేసిన కామెంట్లు ఇవీ..
అప్పులు చేయడం తప్పుకాదు.
అప్పులు ఎవరు మాత్రం చేయడం లేదు?
అప్పు చేయకుండా సాధారణ కుటుంబమే గడవడం లేదు.
ప్రభుత్వం అప్పులు చేయకుండా ఎలా నడుస్తుంది?
అప్పులు చేసి మేం తింటున్నామా?
ప్రజలకు సంక్షేమం ఇవ్వాలంటే ఆ మాత్రం అప్పు చేయకుండా ఎలా?
మా కన్నా చంద్రబాబే ఎక్కువగా అప్పులు చేశారు.
ఆయనను అడగలేదు.. ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నించే అర్హత మీకు లేదు
అప్పులు చేసినా.. సీఎం తన సామర్థ్యంతో వాటిని తిరిగి చెల్లిస్తారు.
చంద్రబాబు మాపై అప్పుల బండ వేసి పోయారు.
చంద్రబాబుపాలనలో అనేక మందికి బకాయి పెట్టారు.
వాటిని తీర్చడానికే అప్పులు చేస్తున్నాం.
సీఎం జగన్కు అప్పులు చేయడం ఇష్టం లేదు.
కానీ, ప్రజల కోసం.. వారి సంక్షేమం కోసం అప్పులు చేయక తప్పడం లేదు.