బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో వైసీపీ, కాంగ్రెస్ పార్టీలపై ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఏపీలో జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకే ఒరలో రెండు కత్తుల వంటివని, వేర్వేరు కాదని మోడీ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. ఆ రెండు పార్టీల నాయకత్వం ఒకే కుటుంబం నుంచి వచ్చిందంటూ మోడీ చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. వైసీపీవ్యతిరేక ఓటును కాంగ్రెస్ కు మళ్ళించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మోడీ ఆరోపించారు.
ఈ నేపథ్యంలోనే మోడీ వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. ఇటు జగన్ ను, అటు బాబును రెండు పంజరాల్లో పెట్టి ఆడిస్తున్న రింగ్ మాస్టర్ మోడీ అని షర్మిల ఘాటుగా విమర్శలు చేశారు. పదేళ్లపాటు రాష్ట్ర వినాశనంలో ముఖ్య పాత్ర పోషించిన మోడీ ఇప్పుడు కాంగ్రెస్, వైసీపీ ఒకటే అని కూతలా అంటూ షర్మిల ఫైర్ అయ్యారు. ఐదేళ్లుగా జగన్ తో అంట కాగుతూ వైసీపీ నేతల అరాచకాలను అడ్డుకోకుండా వారికి అడ్డగోలు సహాయ సహకారాలు అందించింది ఎవరు అని షర్మిల ప్రశ్నించారు.
ఏపీని ఇంకా నాశనం చేయండి, ఇంకా అప్పు తెచ్చుకోండి అంటూ తెరచాటు స్నేహాన్ని నడిపింది ఎవరో చెప్పాలని షర్మిల నిలదీశారు. జగన్ తన దత్తపుత్రుడు అని అభివర్ణించింది ఎవరో తనకు తెలియాలని షర్మిల ప్రశ్నించారు. బీజేపీ పెట్టే ప్రతి బిల్లును పార్లమెంటులో జగన్ పార్టీ సిగ్గు విడిచి మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. మోడీ మిత్రులు అదానీ, అంబానీలకు ఏపీలో ఆస్తులు కట్టబెట్టింది వైసీపీ ప్రభుత్వం అని షర్మిల ఆరోపించారు. ఇక, మోడీ అనుయాయులకు రాజ్యసభ సీట్లు ఇచ్చింది జగన్ ప్రభుత్వం అని, అటువంటి విడదీయరాని స్నేహబంధం మోడీ, జగన్ మధ్య ఉందని షర్మిల ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేక హోదా మీదే అని వాగ్దానం చేశామని, అది బీజేపీ నేతలకు వణుకు తెప్పిస్తోందని షర్మిల దుయ్యబట్టారు. పదేళ్లపాటు బీజేపీ, వైసీపీ, టీడీపీల అసమర్థత మోసాలను కప్పిపుచ్చేందుకే కాంగ్రెస్ పై మోడీ పసలేని దాడులు చేస్తున్నారని ఆరోపించారు.