ఏపీలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటలు యుద్ధం చివరి ఘట్టానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో కడప ప్రజలకు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన పిలుపునిచ్చారు. మీ పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డను ఎలా ప్రేమగా చూసుకుంటారో తనను కూడా మీ ఇంటి ఆడబిడ్డగా చూసుకొని ఓటు వేయాలని షర్మిల నియోజకవర్గ ఓటర్లను అభ్యర్థించారు. హస్తం గుర్తుపై నొక్కి రాజశేఖర్ రెడ్డి బిడ్డను ఆశీర్వదించాలని కొంగుచాచి అడుగుతున్నానని షర్మిల అన్నారు.
కడప గడ్డమీద న్యాయానికి, నేరానికి మంచి జరుగుతున్న పోరాటంలో కడప లోక్ సభ నియోజకవర్గ ఓటర్లంతా న్యాయం వైపు నిలబడతారని నమ్ముతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. షర్మిలను ఎంపీగా గెలిపిస్తే కడపలోనే కలవొచ్చరని, అవినాష్ రెడ్డిని ఎంపీగా గెలిపిస్తే జైలుకు వెళ్లి ఆయనను కలవాల్సి ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఓటేస్తారో, అవినాష్ రెడ్డికి ఓటేస్తారో నియోజకవర్గ ప్రజలు నిర్ణయించుకోవాలని షర్మిల చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.