తన సోదరుడు సీఎం జగన్ పై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల కోసం, అధికారం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి జగన్ అని షర్మిల షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఓ తాగుబోతు అంటూ విమర్శించిన బొత్స సత్యనారాయణకు జగన్ మంత్రి పదవి ఇచ్చి కూర్చోబెట్టారని ఘాటుగా విమర్శించారు. ఇక తన తల్లి విజయమ్మ గురించి కూడా బొత్స కించపరిచే వ్యాఖ్యలు చేశారని గుర్తు చేసుకున్నారు. అటువంటి వ్యక్తిని తన ప్రభుత్వంలో మంత్రిగా జగన్ నియమించుకున్నారని విమర్శించారు.
తన తల్లిదండ్రుల గురించి నీచంగా మాట్లాడిన బొత్స సత్యనారాయణ ఇప్పుడు జగన్ కు పితృ సమానులు ఎలా అయ్యారు అని షర్మిల ప్రశ్నించారు. గతంలో వైఎస్ ను తిట్టిన వాళ్లే ఈరోజు జగన్ క్యాబినెట్ లో మంత్రులుగా ఉన్నారని మండిపడ్డారు. జగన్ కు ఉరేయాలని గతంలో బొత్స అన్న వ్యాఖ్యలను షర్మిల ప్రస్తావించారు. తన తండ్రిని తిట్టిన వాళ్లంతా జగన్ కు తండ్రులు, అక్కలు, చెల్లెళ్లు, అన్నలు అంటూ ఎద్దేవా చేశారు. వైఎస్ కోసం పనిచేసే గొడ్డలి పోటుకు గురై ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఆయనకు ఏమీ కారంటూ పరోక్షంగా వివేక హత్య గురించి షర్మిల ప్రస్తావించారు. వైఎస్ఆర్సిపి లో వైఎస్ఆర్ లేడని వై అంటే వైవీ సుబ్బారెడ్డి ఎస్ అంటే సాయి రెడ్డి ఆర్ అంటే రామకృష్ణారెడ్డి అని కొత్త భాష్యం చెప్పారు.