ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తాజాగా బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్క రించుకుని విజయవాడలో మాట్లాడిన ఆమె.. బీజేపీ తీరుపై విమర్శలు గుప్పించారు. దేశవ్యాప్తంగా మహిళలపై దాడులు, మానభంగాలు జరుగుతున్నా.. కేంద్రంలోని బీజేపీ సర్కారుకు ఏమాత్రం పట్టడం లేదన్నారు. మహిళలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే వాడుకుని వదిలేస్తున్నారని షర్మిల దుయ్యబట్టారు. మహిళలను దేశంలో సెకండ్ క్లాస్ సిటిజన్లుగానే చూస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వికసిత భారత్ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా మారిందని విమర్శించారు.
“దేశంలో మోడీగారు చాలా గొప్పగా చెబుతున్నారు. వికసిత భారత్ అని వల్లె వేస్తున్నారు. కానీ, వికసిత భారత్లో గంటకు 50 మంది మహిళలపై దాడులు జరుగుతున్నాయి. 80 మందిపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. అయినా.. వికసిత భారత్ బాగుందట“ అని షర్మిల వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇంత జరుగుతున్నా.. కేంద్రంలోని బీజేపీ సర్కారు పట్టించుకోవడం లేదన్నారు. ఆచరణలో మహిళలకు ఒరుగుతున్నది ఏమీ లేదని దుయ్యబట్టారు. అంతేకాదు.. “మహిళలను వేధించిన చరిత్ర బీజేపీ, దాని అనుబంధ సంఘాలదే“ అని షర్మిల వ్యాఖ్యానించారు.
మణిపూర్లో పట్టపగలు మహిళలను వివస్త్రలను చేసి .. ఊరేగించినప్పుడు.. దీనిని యావత్ దేశం చూసిందని, అయినా కేంద్రం మాత్రం కళ్లు మూసుకుందని షర్మిల విమర్శించారు. దీనిపై ఇప్పటి వరకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుందో ఎవరికీ తెలియలే దన్నారు. దేశవ్యాప్తంగా ఉద్యోగినులకు కూడా రక్షణ కొరవడుతోందన్నారు. అనేక మందిపై దాడులు జరుగుతున్నా.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వినకు-కనకు అన్న సూత్రాన్ని పాటిస్తోందని వ్యాఖ్యానించారు. గడిచిన పదేళ్లలో 2 లక్షల మంది మహిళలపై వేధింపుల కేసులు నమోదయ్యాయని తెలిపారు. గత ఐదేళ్లలో 25 శాతం అఘాయిత్యాలు పెరిగాయని షర్మిల చెప్పారు. ఇంత జరుగుతున్నా వికసిత భారత్, నారీ శక్తి అంటూ.. మోడీ సర్కారు జపం చేస్తోందని షర్మిల దుయ్యబట్టారు.