తెలంగాణ మహిళలు వ్యాపార వేత్తలుగా కాకుండా.. వ్యాపార దిగ్గజాలుగా ఎదిగేలా వారిని ప్రోత్సహిస్తున్నట్టు తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో అదానీ-అంబానీలతోనే రాష్ట్రంలోని మహిళలు పోటీ పడేలా చేస్తున్నామన్నారు. అన్ని రూపాల్లోనూ మహిళలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్టు చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించు కుని శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో సీఎం రేవంత్ పర్యటించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో నూతన క్యాంపస్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.
అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యార్థులను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోంద న్నారు. ఐలమ్మ విశ్వవిద్యాలయంలో చదువుకునే విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి విధ్యాసంస్థలతో పోటీ పడాలని ఆయన పిలుపునిచ్చారు. స్వయం సహాయక సంఘాల ద్వారా 100 ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇస్తున్నట్టుచెప్పారు. తద్వారా డ్రైవర్లు, కండెక్టర్లు కూడా మహిళలే ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా ఇంటి పైకప్పుపై సోలార్ విద్యుత్ ప్యానళ్లు ఏర్పాటు చేసి.. తద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. మిగులు విద్యుత్‌ను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.
ఇప్పటికే మహిళా శక్తి పేరుతో రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించామని, తద్వారా వారిని ఆర్థికంగా ఆదు కుంటున్నట్టు సీఎం చెప్పారు. పారిశ్రామికంగా కూడా.. మహిళలకు అనేక అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం ప్రాధా న్యం ఇస్తుందన్నారు. అదానీ-అంబానీ వంటి పారిశ్రామిక దిగ్గజాలతోనే పోటీ పడేలా తెలంగాణ మహిళలు ఉండాలన్న సంకల్పం తో త్వరలోనే మరో పారిశ్రామిక పథకానికి శ్రీకారం చుట్టనున్నట్టు రేవంత్‌రెడ్డి తెలిపారు. అయితే.. గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్య చాలా తక్కువగా ఉంటోందని.. ఈ విషయంలో తల్లిదండ్రులు పట్టించుకుని చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్య విషయంలో మహిళలకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు.