సంఖ్యా బలం లేకపోయినా.. విపక్షాల గళం బలంగా ఉంటే ఏం జరుగుతుందో.. ఏపీ లో రాత్రికి రాత్రి తీసుకున్న రెండు కీలక నిర్ణయాలు అద్దం పడుతున్నాయి. వీటిలో ఒకటి విద్యుత్ ఉద్యోగుల సమ్మె, రెండోది అర్చకుడిపై వైసీపీ నాయకుడి దాడి. ఈ రెండు విషయాల్లోనూ యుద్ధ ప్రాతిపదికన వైసీపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం సంచలనంగా మారింది. అయితే.. దీనికి సంబంధించి రాజకీయ విశ్లేషకులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకవైపు.. టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలో ఉండడం.. మరోవైపు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడుగా ఉండడంతో సర్కారు ఇప్పుడు ఇలా వ్యవహరిస్తోందని అంటున్నారు.
విద్యుత్ ఉద్యోగుల విషయం..
దాదాపు రెండేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేస్తున్నా.. పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్న ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగులు ఇలా సమ్మెకు నోటీసులు ఇవ్వగానే అలా చర్చలకు పిలిచేసింది. పీఆర్సీపై ఉద్యోగుల డిమాండ్‌కు అంగీకారం తెలిపింది. ఫిట్మెంట్ 8 శాతం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. మాస్టర్ స్కేల్ రూ. 2.60 లక్షలు ఇచ్చేందుకు కూడా ఆమోదం తెలిపింది. దీంతో వీటిపై విద్యుత్ సంస్థల యాజమాన్యం, ఉద్యోగ సంఘాల నేతలు సంతకాలు చేశారు. సమ్మె నోటీసు ఉపసంహరించుకు న్నట్లు ఏపీఎస్‌పీఈజేఏసీ ప్రకటించింది. నిజానికి ఇంత వేగంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం చిత్రమేనని అంటున్నారు పరిశీలకులు.
అర్చకుడి వివాదం..
ఇక, అర్చకుడి వివాదం విషయానికి వస్తే.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని సోమేశ్వరాలయంలో సహాయ అర్చకుడు పవన్‌పై వైసీపీ నేత, ఆలయ పాలకమండలి చైర్ పర్సన్ కె. విజయలక్ష్మి భర్గ యుగంధర్ దాడి చేశారు. ఈ క్రమంలో అర్చకుడి యజ్ఞోపవీతాన్ని కూడా తెంచేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది. దీనిపై జనసేన అధినేత పవన్ తీవ్రస్తాయిలో విరుచుకుపడ్డారు. మరోవైపు బ్రాహ్మణ సంఘాలు కూడా నిరసనకు దిగాయి. అంతే.. మంగళవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో జరిగిన ఈ వివాదానికి 24 గంటలు కూడా తిరగకుండానే సర్కారు చెక్ పెట్టేసింది. పాలక మండలి చైర్ పర్సన్ విజయలక్ష్మితో ఆ పదవికి రాజీనామా చేయించింది.
ఇది కూడా చిత్రమే. ఎందుకంటే.. గతంలో దుర్గగుడికి సంబంధించివెండి సింహాల దొంగతనం కేసులోను, తూర్పులో జరిగిన అంతర్వేది రథం దగ్ధం సమయంలోను, విజయనగరంలోని రామతీర్థంలో రాముడి శిరచ్ఛేదం ఘటనలోనూ ఇప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అలాంటి ప్రతిపక్షాలు దూకుడుగా ఉన్న నేపథ్యంలో సర్కారు ఆత్మరక్షణలో పడిందని.. అందుకే వెనువెంటనే సోమేశ్వరాలయ చైర్‌పర్సన్‌ను రాజీనామా చేయించిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.