తమిళ హీరో అయినప్పటికీ తెలుగు స్టేట్స్ లో కూడా మంచి పాపులరిటీ సంపాదించుకున్న హీరోల్లో సూర్య ఒకరు. ప్రస్తుతం ఈయన `కంగువ` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. సూర్య కెరీర్ లో తొలి పాన్ ఇండియా చిత్రమిది. శివ దర్శకత్వం వహించిన కంగువ నవంబర్ 14న అట్టహాసంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గా నిర్వహించగా.. దర్శకధీరుడు రాజమౌళి, బోయపాటి శ్రీను, యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ స్పెషల్ గెస్ట్లుగా విచ్చేశారు.
అయితే ఈవెంట్ లో భాగంగా రాజమౌళి మాట్లాడుతూ.. పాన్ ఇండియన్ మూవీ బాహుబలి చేయడానికి సూర్యనే తనకు స్ఫూర్తి అని వ్యాఖ్యానించారు. అలాగే సూర్య స్క్రీన్ ప్రజెన్స్, యాక్టింగ్ అంటే తనకు చాలా ఇష్టమని.. ఒకసారి తాను, సూర్య కలిసి సినిమా చేయాలని అనుకున్నామని.. కానీ కుదర్లేదని జక్కన్న చెప్పుకొచ్చారు. గతంలో సూర్య కూడా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా మిస్ అయ్యాయని పలుమార్లు చెప్పుకొచ్చాడు.
దీంతో రాజమౌళి, సూర్య కాంబోలో మిస్ అయిన సినిమా ఏదో తెలుసుకునేందుకు సినీ ప్రియులు తెగ ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ సినిమా మరేదో కాదు `మగధీర`. రాజమౌళి మొదట ఈ చిత్రాన్ని సూర్యతో చేయాలని భావించారు. కానీ సూర్య పలు కారణాలతో తిరస్కరించడం జరిగింది. ఆ తర్వాత రాజమౌళి మెగా హీరో రామ్ చరణ్ తో మగధీరను తెరకెక్కించి ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేశాడు.