గతంలో ఎప్పుడూ లేని రీతిలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తరచూ వార్తల్లో వ్యక్తిగా మారుతున్నారు.
రోజులో రెండు సందర్భాల్లో ఆయన పేరు ప్రస్తావనకు రావటం.. అది కూడా రాకూడని రీతిలో రావటం విస్మయానికి గురి చేస్తోంది. చేతిలో అపరిమితమైన అధికారం ఉండటమో.. బలమైన అత్యంత శక్తివంతమైన సీఎం ఆశీస్సులు పుష్కలంగా ఉండటం.. తానేం చేసినా ఆయనేం ప్రశ్నించరన్న ధీమానో కానీ.. ఆయన వరుస తప్పులు చేస్తున్నారు.
ఆయన తీరును సాక్ష్యాత్తు హైకోర్టు కూడా అభ్యంతరం పెట్టటం చూసిందే.
తాజాగా ఆయన నిర్వహించిన ప్రెస్ మీట్ మీద బోలెడన్ని విమర్శలు.. జోకులు.. ఎటకారాలు వైరల్ అవుతున్నాయి. మీడియా సమావేశాన్ని ప్రారంభించటంలోనూ.. ట్రెండ్ చాలా బాగుందన్న మాటను ఉపయోగించటంతో.. ఆ మాట ప్రస్తుత సందర్భంలో దేనికి సూట్ అవుతుందో అర్థం కాక కిందా మీదా పడిన పరిస్థితి.
మీడియా ప్రతినిధులకు మాత్రమే కాదు.. టీవీల్లో లైవ్ చూసినోళ్లకు ఇలాంటి అనుభవమే.
కొవిడ్ కేసులు సంఖ్య తగ్గిందని.. ఆక్సిజన్ పడకలు సరిపోయినన్ని ఉన్నాయని చెబుతున్నారు.
విలేకరుల్ని వెంట పెట్టుకొని.. రోజులో పది ఆసుపత్రులకు తీసుకెళ్లి .. మీ మాటలో ఉన్న నిజాల్ని చూపిస్తే బాగుంటుంది.
అంత దాకా ఎందుకు.. ప్రభుత్వ.. ప్రైవేటు ఆసుపత్రులకు బెడ్ల కోసం వస్తున్న రిక్వెస్టులు.. వారు రిజెక్టు చేస్తున్న వైనం గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది.
అదంతా వదిలేసి.. ఆల్ ఈజ్ వెల్ అన్నట్లుగా వ్యవహరించటం మీకే చెల్లుతుంది.
వ్యాక్సిన్ల విషయంలో రాష్ట్రాలు తమకు తాముగా టీకాలు కొనుక్కోవచ్చని కేంద్రం చెప్పింది.
ఏ ధరకు కొనాలో కూడా చెప్పేసింది. మరి.. ఇప్పటివరకు మీరెన్ని కంపెనీలతో మాట్లాడారు? తుది ఒప్పందం ఎవరితో చేసుకున్నారన్న విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదెందుకు?ఆ మధ్యన టీకా అవసరమైన వారందరికి తెలంగాణలో ఉచితమని చెప్పించారు.
మరేం జరుగుతుందో తెలిసిందే. కొవిన్ యాప్ ఓపెన్ చేస్తే క్లోజ్ అవుతుంది. అలాంటప్పుడు టీకా వేసుకోవటం ఎలా సీఎస్ గారు?
మీడియా సమావేశంలో మీరు ముఖానికి మాస్కుపెట్టుకోలేదు. మీతో ఉన్న వారంతా మాస్కులు ధరించారు?మాస్కు ధరించకుండా ఏమని సందేశంఇవ్వాలన్నది మీ ఉద్దేశం?
ఇప్పటికి జరుగుతున్న రచ్చ సరిపోవటం లేదా? వైరస్ ను నిలువరించే అవకాశం ఉన్న వాటిల్లో మాస్కు ఒకటి. దాని విషయంలో మీరెంత నిర్లక్ష్యమన్నది ఇట్టే అర్థమవుతుంది. ఒక రాష్ట్ర సీఎస్ ఇలా ఉంటే.. మిగిలిన రాష్ట్ర ప్రజల మాటేమిటి? అంతేకాదు.. మీడియా సమావేశం సందర్భంగా బిస్కెట్లు తినటం.. అదే చేతిని ముక్కును రుద్దుకోవటం.. చేతులకు అడ్డంగా పెట్టుకొని కాస్తదగ్గటం లాంటివి చేశారు.
ఇలాంటివన్నీ మీలాంటిస్థానంలో ఉన్న వారు చేయొచ్చా? అన్నది ప్రశ్న. మీడియాతో మాట్లాడే కాసేపు కూడా సరిగా ఉండటం సాధ్యం కాని మీరు.. కీలక స్థానంలో కోట్లాది మందిని ప్రభావితం చేసే కుర్చీలో కూర్చున్నారన్నది మర్చిపోతే ఎలానండి?