వైసీపీ మాజీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయ విరామానికి సెలవు ఇవ్వబోతున్నారా..? పొలిటికల్ రీఎంట్రీకి సిద్ధం అయ్యారా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ ఆవిర్భావానికి ముందు నుంచే జగన్ మోహన్ రెడ్డితో విజయసాయిరెడ్డికి ప్రత్యేక అనుబంధం ఉంది. జగన్ కేసుల్లో ఏ2గా ఉన్న విజయ్ సాయి రెడ్డి.. కొన్నాళ్లు జైలు జీవితాన్ని కూడా గడిపారు. అలాగే వైసీపీని స్థాపించడంలో.. పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావడంలో జగన్ కు మించి విజయసాయిరెడ్డి కష్టపడ్డారు. వైసీపీలో నెంబర్ 2 గా ఎదిగారు.
ఐతే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైంది. ఆ తర్వాత ఎందరో ముఖ్య నేతలు పార్టీని వీడారు. అనూహ్యంగా విజయసాయిరెడ్డి సైతం వైసీపీకి గుడ్ బై చెప్పారు. పార్టీ సభ్యత్వం తో పాటు రాజ్యసభ పదవిని సైతం వదులుకున్నారు. దీని వెనుక బీజేపీ హస్తం ఉందన్న టాక్ అప్పట్లో నడిచింది. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు పేరు మోసిన ఇతర పార్టీ నేతలను బీజేపీలో చేర్చుకోవాలని కమలం పార్టీ పెద్దలు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే కేసులు, అరెస్ట్‌ల నుంచి తప్పించుకునేందుకు సాయిరెడ్డి కేంద్రమంత్రి అమిత్ షాతో అన్ని మాట్లాడుకుని వైసీపీని వీడినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
రాజీనామా అనంతరం రాజకీయాల గురించి మాట్లాడనని.. వ్యవసాయం చేసుకుంటానని విజయసాయిరెడ్డి ప్రకటించారు. తన ఫామ్ హౌస్ లో వ్యవసాయం చేస్తున్న ఫోటోలు కూడా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. కానీ రాజకీయాల గురించి మాట్లాడడం మాత్రం ఆపలేదు. పైగా ఈమధ్య వైసీపీ టార్గెట్ గా సంచలన ట్వీట్స్ చేస్తున్నారు. దీంతో ఆయన అడుగులు కూటమి వైపు పడుతున్నట్లు ఒక స్పష్టత వచ్చింది. ఇక అందరూ ఊహించినట్లే విజయసాయిరెడ్డి మళ్లీ రాజకీయాల్లోకి రాబోతున్నారట. త్వరలోనే ఆయన బీజేపీలో చేరబోతున్నారని.. ఆ పార్టీ ద్వారా తాను ఖాళీ చేసిన రాజ్యసభ పదవిని మళ్ళీ పొందబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
అయితే సాయిరెడ్డి చేరికపై బీజేపీ ఆసక్తిగా ఉన్నప్పటికీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి అభ్యంతరాలు ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు. వైసీపీ హయాంలో చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఎలా విరుచుకుపడ్డారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అటువ్యక్తిని కూటమిలో చేర్చుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారట. అదేసమయంలో విజయసాయిరెడ్డి బీజేపీలో చేరితే వైసీపీకి చెక్ పెట్టొచ్చు. గత ప్రభుత్వంలో జరిగిన భారీ కుంభకోణాలు ఆధారలతో సహా ఆయన ద్వారా బయటకు లాగొచ్చు. ఇదే విషయంపై కేంద్ర పెద్దలు బాబుతో చర్చలు జరుపుతున్నారు. మరి విజయసాయిరెడ్డి బీజేపీ చేరికను బాబు ఒప్పుకుంటారా? లేదా? అన్నది చూడాలి.