మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కొద్దిరోజుల క్రితం రాజకీయ సన్యాసం తీసుకున్న సంగతి తెలిసిందే. ఎంపీ పదవితో పాటు వైసీపీ పార్టీ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. రాజకీయాలు వద్దు వ్యవసాయమే ముద్దు అన్నారు. వైసీపీని వీడాక విజయ్ సాయి రెడ్డి సైలెంట్ గా ఉంటారని అందరూ భావించారు. కానీ అందుకు భిన్నంగా ఫ్యాన్ పార్టీపై ఆయన యుద్ధం మొదలుపెట్టారు. జగన్ చుట్టూ కోటారి తయారైందని.. ఆ కోటరి వల్లే తాను జగన్ కు దూరమయ్యానని.. జగన్ వద్ద తనకు విలువ లేకుండా పోయిందని ఇటీవల మీడియా ముఖంగా విజయ సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా మరోసారి జగన్ ను టార్గెట్ చేసిన విజయసాయి రెడ్డి.. రాజ్యాలు, రాజులు, కోటలు, కోటరీలు అంటూ ఓ పిట్టకథ చెప్పుకొచ్చారు. `పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారు. కోటలో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ ఉండేది. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా, రాజ్యం ఎలా ఉన్నా ఆ కోటరీ ఏం చేసేదంటే, ఆహా రాజా! ఓహో రాజా అంటూ పొగడ్తలతో రాజు కళ్ళకు గంతలు కట్టి, తమ ఆటలు సాగించుకునేది. దీనితో రాజూ పోయేవాడు, రాజ్యం కూడా పోయేది.
కోటరీ కుట్రల్ని గమనించిన మహా రాజు, తెలివైన వాడు అయితే మారు వేషంలో ప్రజల్లోకి వచ్చి, ఏం జరుగుతోందో తనకు తానుగా తెలుసుకునేవాడు. వారిమీద వేటు వేసి, రాజ్యాన్ని కాపాడుకునేవాడు. కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి! ప్రజల మనసెరిగి వారి ఆకాంక్షలను అర్థంచేసుకోవాలి. లేదంటే కోటరీ వదలదు, కోట కూడా మిగలదు! ప్రజాస్వామ్యంలో అయినా జరిగేది ఇదే` అంటూ తన అధికారిక ఎక్స్ ఖాతాలో జగన్ కు పరోక్షంగా విజయసాయిరెడ్డి చురకలు వేశారు. అయితే సాయిరెడ్డి విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నప్పటికీ వైసీపీ నేతలు మాత్రం గట్టిగా కౌంటర్ ఎటాక్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే, ఆయనకు ఘాటుగా బదులిస్తే ఎక్కువ నష్టపోయేది వైసీపీనే అని.. ఆ పార్టీ రహస్యాలన్ని విజయసాయిరెడ్డి బయటపెట్టడమే కాక జగన్ అక్రమాస్తుల కేసులో అప్రూవర్ గా మారే అవకాశాలు కూడా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.