ప్రముఖ టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఓ దుండగుడు ఆదివారం తెల్లవారుజామున విశ్వక్ సేన్ ఇంట్లోకి చొరబడి లక్షలు విలువచేసే బంగారు ఆభరణాలు దోచుకెళ్ళాడు. హీరో తండ్రి కరాటే రాజు ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ ఫిలింనగర్ రోడ్డు నెంబర్- 8లోని విశ్వక్ సేన్ కుటుంబం మొత్తం ఒకే ఇంట్లో నివాసం ఉంటోంది.
అయితే ఆదివారం తెల్లవారుజామున 5 గంటల 50 నిమిషాల ప్రాంతంలో ఒక గుర్తుతెలియని వ్యక్తి బైక్ మీద వచ్చి ఇంటి గేటు తీసుకుని నేరుగా మూడో అంతస్తుకు వెళ్లాడు. అక్కడ విశ్వక్ సేన్ సోదరి వన్మయి గదిలోకి వెనుక డోర్ నుంచి చొరబడి అల్మరాలో నుంచి బంగారు ఆభరణాలు తీసుకుని వెళ్లిపోయాడు. అయితే తన రూమ్ లో వస్తువులన్ని చిందరవందరగా పడి ఉండటం గమనించిన వన్మయి.. వెంటనే అల్మరా చెక్ చేయగా అక్కడ ఉండాల్సిన బంగారు ఆభరణాలు మాయమైనట్లు తేలింది.
వెంటనే ఈ విషయాన్ని తండ్రి దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన ఫిలింనగర్ పోలీసులను ఆశ్రయించారు. కరాటే రాజు ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్లూస్ టీం సహాయంతో ప్రాథమిక ఆధారాలు, వేలిముద్రలు సేకరించారు. అలాగే సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. కేవలం ఇరవై నిమిషాల్లోనే దుండగుడు ఇంట్లో చొరబడటం, సొమ్ము తీసుకుని పారిపోవడం జరిగాయని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుడు కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. కాగా, చోరీకి గురైన ఆభరణాల విలువ రూ.2.20 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. అందులో రెండు డైమండ్ రింగ్స్ కూడా ఉన్నట్లు ఫిర్యాదులు పేర్కొన్నారు.