ఏపీలో వాలంటీర్లను ఎన్నికల విధులకు ఏజెంట్లుగా నియమించేందుకు వీల్లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు సంబంధించిన ఏ విధుల్లోనూ వాలంటీర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్గొనకూడదని స్పష్టం చేసింది. ఎన్నికల సమయంలో ఏజెంట్లుగా ఉంటూ, ఏదో ఒక పార్టీకి అనుబంధంగా, అనుకూలంగా పనిచేసేందుకు వీల్లేదన్నది ఆ ఆదేశాల సారాంశం.
కానీ, ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న వైసీపీ నేతలు మాత్రం…వాలంటీర్లు తమ పార్టీ కార్యకర్తల్లా ఫీలవుతుంటారు. ఏది మంచి ప్రభుత్వమో, ఎవరికి ఓటేయాలో చెప్పే హక్కు వాలంటీర్లకు ఉందని మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇటీవల చేసిన కామెంట్లు దుమారం రేపాయి. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు చెప్పాల్సింది వాలంటీర్లేనని, రాజ్యాంగం ప్రసాదించిన హక్కులన్నీ వాలంటీర్లకు కూడా ఉంటాయని ఉపోద్ఘాతమిచ్చారు ధర్మాన.
ఈ నేపథ్యంలోనే వాలంటీర్లపై మరో అడుగు ముందుకు వేసి నెక్స్ట్ లెవల్ కామెంట్స్ చేశారు మైలవరం ఎమ్మెల్యే, వైసీపీ నేత వసంత కృష్ణ ప్రసాద్. గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న కొందరు వాలంటీర్లు ఇంకా టీడీపీకి అనుకూలంగా పని చేస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చిందని, అందులో టీడీపీ సానుభూతిపరులకు కూడా చోటిచ్చామని అన్నారు.
వాళ్లు మారుతారు అనుకునే ఉద్దేశంతో వారికి ఉద్యోగం ఇచ్చామని కానీ కొందరు వాలంటీర్లు ఇంకా మారలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. మారని వాలంటీర్లను స్థానిక నేతలు గుర్తించాలని, అటువంటి వారిని తక్షణమే విధుల నుంచి తొలగిస్తామని వసంత కృష్ణ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. వాలంటీర్లు వ్యవస్థ పూర్తిగా మన చేతుల్లో ఉందని, అలా అని అకారణంగా ప్రతి వాలంటీర్ ను మారుస్తామంటే కుదరదని అన్నారు.