సుదీర్ఘకాలం నుంచి స్టార్ హీరోగా సత్తా చాటుతూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మెగాస్టార్ చిరంజీవి కి తాజాగా మరో అరుదైన గౌరవం లభించింది. ఏకంగా యూకే నుండి ఆయనకు పిలుపు వచ్చింది. నాలుగు దశాబ్దాలకు పైగా సినిమా రంగంలో చిరంజీవి అందిస్తున్న సేవలను గుర్తించిన యూకే ప్రభుత్వం ఆయనకు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రకటించింది.
2025 మార్చి 19న యూకే పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో చిరంజీవిని అవార్డుతో సత్కరించబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడటంతో.. అభిమానులు, సినీ ప్రియులు మరియు తోడి సినీ తారలు చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా, ప్రస్తుతం చిరు `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. మల్లిడి వసిష్ఠ డైరెక్ట్ చేస్తున్న సోసియో-ఫాంటసీ చిత్రమిది.
చెన్నై సోయగం త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా.. ఎం. ఎం. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న విశ్వంభర ఈ ఏడాది చివర్లో విడుదల అయ్యే అవకావాలు కనిపిస్తున్నాయి. ఇక విశ్వంభర సెట్స్ మీద ఉండగానే శ్రీకాంత్ ఓదెలతో ఓ చిత్రాన్ని, అనిల్ రావిపూడితో ఓ చిత్రాన్ని మెగాస్టార్ లైన్ లో పెట్టారు.