చలా ఏళ్ల కిందటే క్లోజ్ అయిపోయినట్లుగా కనిపించిన త్రిష కెరీర్.. మధ్యలో భలేగా పుంజుకుంది. సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఒక దశలో వరుణ్ మణియన్ అనే నిర్మాతతో ఆమె పెళ్లికి సిద్ధపడడం గుర్తుండే ఉంటుంది. కానీ వారి నిశ్చితార్థం క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత త్రిష మళ్లీ సినిమాల్లో బిజీ అయింది. రజినీకాంత్, విజయ్, అజిత్ లాంటి టాప్ స్టార్లతో సినిమాలు చేస్తూ ఇప్పటికీ టాప్ రేంజిలో కొనసాగుతోంది త్రిష. అజిత్ గత చిత్రం ‘విడాముయర్చి’తో పాటు కొత్త సినిమా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’లోనూ ఆమే హీరోయిన్. నిన్ననే రిలీజైన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తమిళంలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అజిత్ అభిమానులు ఈ సినిమా చూసి ఊగిపోతున్నారు. సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అంటున్నారు.
ఐతే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సక్సెస్ విషయంలో టీం అంతా ఉత్సాహంగా ఉన్న సమయంలో త్రిష మాత్రం ఇబ్బంది పడుతోంది. సోషల్ మీడియాలో ఆమె పట్ల నెగెటివిటీనే అందుక్కారణం. ఈ చిత్రంలో అజిత్ స్క్రీన్ ప్రెజెన్స్, నటన విషయంలో ప్రశంసలు కురుస్తుండగా.. త్రిష గురించి మాత్రం నెగెటివ్ కామెంట్లే వినిపిస్తున్నాయి. తన లుక్, యాక్టింగ్ సరిగా లేదని అనడమే కాక.. తన డబ్బింగ్ విషయంలో తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ఈ చిత్రంలో త్రిషకు వేరొకరితో డబ్బింగ్ చెప్పించారు. తమిళ అమ్మాయి అయినప్పటికీ డబ్బిాంగ్ చెప్పుకోలేదా.. ఇంత అశ్రద్ధ ఏంటి అంటూ తమిళ నెటిజన్లు త్రిష మీద మండిపడుతున్నారు. ఈ నెగెటివిటీ అంతా త్రిష వరకు వెళ్లింది. దీంతో ఆమె ఒక పోస్ట్ కూడా పెట్టింది. ‘‘మీలాంటి విషపూరితమైన వ్యక్తులు ఎలా బతుకుతున్నారు. మీకు పశాంతంగా ఎలా నిద్ర పడుతుంది? ఖాళీగా కూర్చుని ఇతరుల గురించి పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టడమేనా మీ పని? మిమ్మల్ని చూస్తుంటే భయంగా ఉంది. మీతో కలిసి జీవించే వారి విషయంలో బాధగా ఉంది. నిజం చెప్పాలంటే ఇది పిరికితనం. గాడ్ బ్లెస్ యు’’ అని త్రిష పేర్కొంది.