నువ్వా నేనా అన్నట్లుగా ఎన్నికల ప్రచారం సాగుతున్న బెంగాల్ లో.. తుది విజయం ఎవరిది? ఎన్నికల ప్రకటనకు కొద్ది నెలల నుంచే దీదీకి షాకుల మీద షాకులు ఇచ్చేందుకు మోడీషాలు వేసిన ఎత్తుగడలు అన్నిఇన్ని కావు. ఇందులో భాగంగా దీదీ పార్టీకి చెందిన పలువురు నేతలు బీజేపీలోకి తీసుకెళ్లటం మొదలు.. చేయని ప్రయత్నాలు లేవు. అదే సమయంలో.. దీదీ సైతం కమలనాథుల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ధీటుగా బదులిస్తున్నారు. దీంతో.. తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ లో గెలుపు మీద అందరిలోనూ ప్రత్యేక ఆసక్తి వ్యక్తమవుతోంది.
ఇలాంటివేళ ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ సంస్థతో పాటు సీ ఓటరు తాజా సర్వేను నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాల్ని తాజాగా వెల్లడించింది. తాజా సర్వే ప్రకారం.. బెంగాల్ కోట ముచ్చటగా మూడోసారి దీదీ వశం కానుంది. బీజేపీ దూకుడును తట్టుకొని మరీ మమతమ్మ తన అధికారాన్ని కాపాడుకోనున్నట్లు తేల్చింది.
కాకుంటే.. 2016 ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఈసారి భారీగా సీట్ల సంఖ్యను పెంచుకోనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మూడు సీట్లకు పరిమితమైన బీజేపీ.. ఈసారి ఏకంగా వంద సీట్ల వరకు విజయం సాధించే అవకాశం ఉన్నట్లుగా తేల్చింది.
పశ్చిమబెంగాల్ లో మొత్తం 294 సీట్లు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ అయిన 148 సీట్లకు కాస్త ఎక్కువగా దీదీ పార్టీ గెలవనున్నట్లు తెలిపింది. తాజా సర్వే ప్రకారం టీఎంసీ 152 నుంచి 168 స్థానాల్లో విజయం సాధించనుంది. అదే సమయంలో బీజేపీ 104 నుంచి 120 సీట్లను గెలుచుకోనుంది. వామపక్షాలు కాంగ్రెస్ ఇతరులు 18 నుంచి 26 సీట్లను సొంతం చేసుకోనున్నారు.
హోరాహోరీగా సాగుతున్న ఈ ఎన్నికల్లో తుది విజయం మాత్రం దీదీదే అని తాజా ఓపినీయన్ పోల్ తేల్చింది. మరి.. తుది ఫలితం ఎలా ఉంటుందన్నది తేలాలంటే ‘‘మే 2’’ వరకు వెయిట్ చేయక తప్పదు.