తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఏపీలో పర్యటించబోతున్నారు. జూలై 8న ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి. ఆయన జయంతి వేడుకలు సోమవారం విజయవాడ సీకే కన్వెన్షన్ సెంటర్ లో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో జరగనున్నాయి.
ఈ కార్యక్రమానికి రావాలంటూ షర్మిల కాంగ్రెస్ జాతీయ స్థాయి నేతలతో పాటు ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నాయకులు, ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలోనే విజయవాడలో జరగనున్న వైఎస్సార్ జయంతి వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు.
సీఎంతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా హాజరు కానున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కాగా, వైఎస్సార్ జయంతి వేడుకలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ , లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ముఖ్య అతిథులుగా రానున్నారు. మరియు వైఎస్ అభిమానులు సైతం పెద్ద ఎత్తున సందడి చేయబోతున్నారు.