బీహార్ ఉపముఖ్యమంత్రిగా ఈ మధ్యనే బాధ్యతలు తీసుకున్న తేజస్వీ యాదవ్ అరెస్టుకు సీబీఐ రంగం సిద్ధం చేసిందా ? క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనుమానాలు పెరిగిపోతున్నాయి. 2004-2009 మధ్యలో ల్యాండ్ ఫర్ జాబ్స్ పేరుతో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం కుంభకోణానికి పాల్పడిందని సీబీఐ కేసు నమోదు చేసింది.
లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే శాఖ మంత్రిగా ఉన్న కాలంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి చాలామంది దగ్గర లాలూ కుటుంబ సభ్యులు డబ్బులకు బదులు భూములు తీసుకున్నారన్నది ఆరోపణ. లాలూ కుటుంబం పై ఆరోపణలు ఇప్పటి కావు. చాలా సంవత్సరాల క్రితమే ఆరోపణలు వచ్చాయి తర్వాత మరుగున కూడా పడిపోయాయి.
అనేక కేసుల్లో జైలుశిక్షను అనుభవిస్తున్న లాలూ ఆరోగ్యం కూడా బాగా క్షీణించింది. ఈ నేపధ్యంలోనే బీహార్లో అధికారంలో ఉన్న బీజేపీ+జేడీయూలో గొడవలయ్యాయి. దాంతో బీజేపీ పొత్తు నుండి బయటకు వచ్చేసిన జేడీయూ అధినేత, సీఎం నితీష్ కుమార్ ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమితో చేతులు కలిపారు. కొత్తకూటమి భాగస్వామ్యంతో మళ్ళీ ముఖ్యమంత్రిగా నితీష్ బాధ్యతలు తీసుకున్నారు.
దాంతో బీజేపీ మండిపోతోంది. ఏదో రూపంలో ఈ ప్రభుత్వాన్ని కూలదోయటమే టార్గెట్ గా పెట్టుకున్నట్లు అర్ధమైపోతోంది. 2004-09 మధ్య జరిగినట్లు చెబుతున్న కుంభకోణంపై ఇపుడు కేసులు పెట్టడం ఏమిటి ? అరెస్టులు చేయటంఏమిటి ? భూములిచ్చి ఉద్యోగాలు కొనుక్కున్న వారిలో ఇప్పటికే 16 మంది సీబీఐ అరెస్టుచేసింది. పనిలోపనిగా తేజస్వీపైన కూడా కేసు నమోదుచేసింది. ఈరోజో రేపో అరెస్టుచేయటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది.
భూములిచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు 1442 మంది ఉన్నట్లు సీబీఐ చెబుతోంది. ఇందులో ఎంతవరకు నిజమో కూడా ఎవరికీ తెలీదు.
నిజంగానే కుంభకోణం జరిగుంటే బాధ్యులకు శిక్షలు పడాల్సిందే. కానీ బీహార్లో ప్రభుత్వం మారిన తర్వాతే సీబీఐకి ఈ కేసు గుర్తుకొచ్చిందా ? అన్నదే పాయింట్. నితీష్ బీజేపీతోనే ఉండుంటే, ఆర్జేడీ చీఫ్ తేజస్వి ప్రతిపక్షంలోనే ఉండుంటే ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసు అసలు తెరమీదకు వచ్చుండేదే కాదన్న ఆరోపణలూ పెరిగిపోతున్నాయి.