రాజకీయంగా భిన్నమైన పార్శ్వాలు ఉన్న జిల్లా ప్రకాశం. ఇక్కడ సెంటిమెంటుకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో.. అదేసమయంలో ప్రజలు అభివృద్ది వైపు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తారు. ఎక్కడ తేడా కొట్టినా.. కష్టమే. ప్రజలు అంత అప్రమత్తంగా ఉంటారు.
గత 2014లో ఇక్కడ టీడీపీ గాలి వీస్తే.. 2019 ఎన్నికలకు వచ్చే సరికి.. ప్రజలు యూటర్న్ తీసుకున్నారు. అయితే.. ఎంత యూటర్న్ తీసుకున్నా.. పనిచేస్తున్న.. చేస్తారని అనుకున్న నాయకులు ఏ పార్టీ తరఫున పోటీ చేసినా.. ప్రజలు జైకొట్టారు. అదేసమయంలో వివాదాలకు కేంద్రంగా ఉన్న వారిని పక్కన పెట్టారు.
అందుకే.. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో కంపేర్ చేస్తే.. ప్రకాశం జిల్లా డిఫరెంట్. గత ఎన్నికల్లో ఇక్కడి 12 నియోజకవర్గాల్లో 8 చోట్ల వైసీపీ పాగా వేసింది. మిగిలిన నాలుగు స్థానాల్లోనూ వైసీపీ తుఫాను ఉన్నప్పటికీ టీడీపీ దూసుకుపోయింది. అయితే.. ఒక్క చీరాల ఎమ్మెల్యే మాత్రం వైసీపీకి అనుకూలంగా మారగా.. మిగిలిన ముగ్గురు టీడీపీ సైన్యంగా మారారు.
ఇక, మాజీ ఎమ్మెల్యేలు కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు. అధికార పార్టీలో లుకలుకలు.. ఆధిపత్య జోరు.. పదవుల యావ.. వెరసి.. వైసీపీ ఉసురు తీస్తుండగా.. మార్పు కోరుకుంటున్న వారు.. టీడీపీ వైపు మొగ్గుతున్నారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న (టీడీపీ)4:8(వైసీపీ) ఈక్వేషన్ తడబడడం ఖాయమని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో వైసీపీ నాయకులు ఒకరిపై ఒకరు ఆధిపత్య ధోరణిని ప్రదర్శించుకోవడం.. నాయకులు ఒకరిపై ఒకరు దూషణ పర్వంతో రోడ్డున పడుతున్నారు.
ముఖ్యంగా ఎంపీ స్థాయి నాయకుడు కూడా పార్టీలో యాక్టివ్గా ఉండ కపోవడంతో పార్టీ పరిస్థితి ఇబ్బందిగా మారిందనే టాక్ వినిపిస్తోంది. పైగా.. పార్టీ నేతల మధ్య సఖ్యత లేకపోవడం.. అభద్రతా భావం.. కీలక నాయకులు అచేతనంగా ఉండడం వంటివి నేతలకు శాపంగా మారుతోందనే వాదన వినిపిస్తోంది.