టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడంతో ఏపీ సహా తెలంగాణ ఇతర రాష్ట్రాల్లోని టీడీపీ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. నిన్న మొన్నటి వరకు బెయిల్ వస్తుందా? రాదా? అనే సందేహంలో ఉన్న కీలక నేతల్లోనూ తాజా పరిణామం జోష్ నింపింది. దీంతో పార్టీ ముఖ్య నేతలు అందరూ కూడా మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని సంబరాలు చేసుకున్నారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు బాణసంచా కాల్చారు. చంద్రబాబుపై పెట్టిన ఏ అక్రమ కేసూ నిలబడదని అచ్చెన్నాయుడు అన్నారు. జైలు నుంచి చంద్రబాబు కాలు బయటకు పెట్టిన సమయం నుంచి జగన్ పతనం ప్రారంభమవుతుందని నేతలు హెచ్చరించారు. చంద్రబాబును ఇక ఏశక్తీ ఆపలేదని ధీమా వ్యక్తం చేశారు. అన్ని కేసులూ అక్రమమని త్వరలోనే తేలిపోతుందన్నారు.
బాస్ ఈజ్ బ్యాక్
బాస్ ఈజ్ బ్యాక్ అంటూ.. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న ఆమె ఇంటి వద్దే స్వీట్లు పంచి.. చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. ఒక అగ్రనాయకుడిని ఉద్దేశ పూర్వకంగా జైల్లో పెట్టి.. కొందరు పైశాచిక ఆనందం పొందారంటూ.. ఆమె వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ఇక, టీడీపీ దూకుడు మామూలుగా ఉండబోదని ఆమె వ్యాఖ్యానించారు. చంద్రబాబును గత 50 రోజులుగా దారుణంగా కష్టపెట్టారని శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు.
పైశాచిక ఆనందం పొందారు
చంద్రబాబును లేనిపోని కేసుల్లో జైల్లో పెట్టి.. వైసీపీ నాయకులు పైశాచిక ఆనందం పొందారని.. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. చంద్రబాబు అరెస్టుతో యావత్ తెలుగు జాతి ఖిన్నులైందని, ఆయనకు మద్దతుగా రోడ్డెక్కిందని.. వైసీపీ నేతలకు ఇప్పటికైనా దేవుడు బుద్ధిని ప్రసాదించాలని వ్యాఖ్యానించారు.