ఏపీ రాజకీయాల్లో నేతల పాదయాత్రకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఓ రకంగా చెప్పాలంటే ఇదో పొలిటికల్ సక్సెస్ ఫుల్ ఫార్ములా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి 2003లో చేసిన పాదయాత్ర ఆయనకు 2004లో అధికారాన్ని కట్టబెట్టింది. 2013లో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన పాదయాత్ర ఆయనకు 2014లో అధికారాన్ని తెచ్చిపెట్టింది. ఇక, 2018లో పాదయాత్ర చేసిన జగన్ 2019 ఎన్నికలలో విజయం సాధించారు.
వైఎస్ఆర్, చంద్రబాబు, జగన్…అధికారం అందుకోవడానికి ముందు కాళ్లకు చక్రాలు కట్టుకొని రాష్ట్రమంతా చుట్టేశారు. పార్టీలు, పేర్లు వేరైనా…ఫలితం మాత్రం ఒక్కటే. పాదయాత్రలో జనానికి మరింత చేరువగా వెళ్లే అవకాశం ఉండడంతో ఈ సక్సెస్ ఫుల్ పార్ములాను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, టీడీపీ భావి నేత నారా లోకేష్ కూడా తన పొలిటికల్ కెరీర్ కు అప్లై చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికలే టార్గెట్ గా ఈ ఏడాది ఆగస్టు నుంచి నవ్యాంధ్రప్రదేశ్ మొత్తం చుట్టేలా పాదయాత్ర చేయాలని లోకేష్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
భారీ పాదయాత్రతోనే ప్రజల్లో వైసీపీపై వ్యతిరేకత, అసంతృప్తి మరింత వ్యక్తమవుతుందని లోకేష్ అభిప్రాయపడుతున్నారట. అందుకే, చంద్రబాబు ఇలాకా కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించాలని లోకేష్ ప్లాన్ చేస్తున్నారట. మూడు నుంచి నాలుగు విరామాలు తీసుకొని ఏడాది పొడువునా యాత్ర చేయాలనుకుంటున్నారట. ఏపీ భవిష్యత్తు కాపాడాలన్నా, రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి గట్టెక్కించాలన్నా లోకేష్ రావాల్సిందేనని, జగన్ కు ప్రత్యామ్నాయంగా లోకేష్ మాత్రమేనని జనానికి తెలియజెప్పమే ఈ పాదయాత్ర లక్ష్యమని తెలుస్తోంది.
లోకేష్ ఇమేజ్‌ని మరింత పెంచేలా ఈ యాత్రను ప్లాన్ చేస్తున్నాట. మరి, ఈ సక్సెస్ ఫుల్ పాదయాత్ర ఫార్ములా లోకేష్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడుతుందా? కరోనా మహమ్మారి పొంచి ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో ఈ యాత్రకు ప్రకృతి సహకరిస్తుందా? ప్రభుత్వంపై చిన్నపాటి విమర్శలు చేస్తేనే అరెస్టు చేయిస్తున్న జగన్…తన పీఠాన్ని కదిలించే లోకేష్ పాదయాత్రను సవ్యంగా సాగనిస్తారా లేదా…అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది.