న్యాచురల్ స్టార్ నాని నటుడిగానే కాదు నిర్మాతగానూ సత్తా చాటుతున్నాడు. సినిమాను మార్కెట్ చేయడంలో నాని ఎక్స్పర్ట్. ఈ విషయాన్ని ఇటీవల విడుదలైన `కోర్ట్` నిరూపించింది. ఈ మూవీ రిలీజ్ కు ముందు నాని మాట్లాడుతూ.. కోర్ట్ నచ్చకపోతే నా తదుపరి సినిమా హిట్ 3 చూడొద్దని చెప్పేశాడు. ఈ ఒక్క స్టేట్మెంట్తో అందరి చూపు కోర్ట్‌పై పడింది. కట్ చేస్తే చిన్న సినిమాగా వచ్చిన కోర్ట్ చాలా పెద్ద విజయాన్ని సాధించింది. బలమైన కంటెంట్ తో పాటు నాని ప్రమోట్ చేసిన విధానం సినిమా విజయంలో కీలక పాత్రను పోషించింది.
ఇక ఇప్పుడు `హిట్ 3`తో నాని ప్రేక్షకులకు పలకేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాకు కూడా నానినే నిర్మాత. శైలేశ్ కొలను డైరెక్టర్ కాగా.. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా యాక్ట్ చేసింది. మే 1వ తేదీన పాన్ ఇండియాలో హిట్ 3 రిలీజ్ కాబోతోంది. హిట్ యూనివర్స్‌లో గత చిత్రాలతో పోలిస్తే హిట్ 3 మరింత వైట్‌గా ఉండబోతుందని టీజర్, ట్రైలర్ తో స్పష్టమైంది. అందుకు తగ్గట్లుగానే తాజాగా నాని ఓ బోల్డ్ స్టేట్మెంట్ పాస్ చేశారు.
ప్రచారకార్యక్రమాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో పాల్గొన్న నాని.. ` హిట్ 3 క్రైమ్ థ్రిల్లర్ కావున ఆడాళ్లూ, పిల్లలూ దూరంగా ఉండండి. మా అబ్బాయికి కూడా ఈ సినిమాను చూపించను` అని అనేశారు. అంటే ఆడాళ్లు, పిల్లలు చూడలేనంత వైలెన్స్ తన సినిమాలో ఉందని నాని స్ట్రయిట్ గానే చెప్పేశాడు. అయితే నానికి లేడీ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. పిల్లలు కూడా ఆయన సినిమాలను బాగా ఇష్టపడుతుంటారు. ఇప్పుడు వాళ్లే రాకపోతే.. కలెక్షన్స్‌పై గట్టి ప్రభావం పడే ఛాన్స్ ఉంది.
ఈ విషయం తెలిసి కూడా బోల్డ్ స్టేట్మెంట్ తో నాని వారిని దూరం చేసుకున్నాడంటే.. ఆయన స్ట్రేటజీ వేరే ఉంది. నిజానికి హిట్ 3 ను యాక్షన్ లవర్స్ కోసం తీసిన సినిమా. యానిమల్, మార్కో వంటి చిత్రాలను పిల్లలేమైనా చూశారా? అయిన కూడా అవి హిట్ అయ్యాయి. ఆ సినిమాలు ఎవరికి నచ్చాలో వాళ్లకు నచ్చాయి. ఇప్పుడు హిట్ 3 విషయంలోనూ నాని అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. తన సినిమాకు ఒక వర్గం ప్రేక్షకులు తగ్గితే.. మరో వర్గం ప్రేక్షకులకు పెరుగుతారని బలంగా నమ్ముతున్నాడు. పైగా ఇప్పుడున్న యువతకు ఏదైనా సరే హై డోస్ లో ఇవ్వాల్సిందే. అందుకే నాని తనదైన రీతిలో వాళ్లకు గట్టిగా గాలం వేస్తున్నాడు.