ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి….ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి….విశ్రమించవద్దు ఏ క్షణం…విస్మరించవద్దు నిర్ణయం…అప్పుడే నీ జయం నిశ్చయంరా...పట్టుదల చిత్రంలోని ఈ పాట ఎందరికో స్ఫూర్తి దాయకం…జీవితంలో పట్టుదలో పోరాడితే విజయం మనదేనని చాటి చెప్పే ఈ పాట ఎందరినో కదిలించింది…మరెందరినో ముందుకు నడిపించింది. అయితే, ఈ పాటలోని ప్రతి పదం అతికినట్టు సరిపోయేలా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని విజయాలు సాధిస్తున్న ఎదురులేని మనిషొకరున్నారు.
మొక్కవోని దీక్షతో అడ్డంకులు, అవరోధాలనే ఆయుధాలుగా మలుచుకొని ముందుకు సాగితే ఓటమి కూడా మనల్ని చూసి పారిపోతుదంని నిరూపించిన వ్యక్తి ఆయన. నీరసించి నిలిచిపోతే నిమిషమైన మనది కాదని…బ్రతుకు అంటే నిత్య ఘర్షణ అని నమ్మిన వ్యక్తి ఆయన. దేహముంది ప్రాణముంది నెత్తురుంది.. సత్తువుంది ఇంతకన్న సైన్యం ఏం కావాలి..అని తనను తాను ప్రశ్నించుకున్న గొప్ప దార్శనీకుడాయన.
అతడే ఒక సైన్యంగా 43 ఏళ్లుగా అలుపెరుగని రాజకీయ ప్రస్థానాన్ని అవలీలగా పూర్తి చేసుకున్న ఒకే ఒక్కడు…..ఆయనే టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం ‘నారా చంద్రబాబు నాయుడు’. ప్రజల కోసం ఇటు వ్యక్తిగత జీవితంలో…అటు రాజకీయ జీవితంలో ఎన్నో త్యాగాలను చేసిన చంద్రబాబు నేడు 71వ జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా నమస్తే ఆంధ్ర పాఠకుల కోసం ప్రత్యేక కథనం.
సాధారణంగా రాజకీయ నాయకులు అధికారంలో ఉంటే ఒకలాగా, ప్రతిపక్షలో ఉంటే ఒకలాగా వ్యవహరిస్తుంటారు. కానీ, చంద్రబాబు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పడూ ఆయనది ప్రజాపక్షమే. ప్రజాసేవే జీవితపరమావధిగా స్థిత ప్రజ్ఞతతో ఒక ప్రత్యేక జీవన సరళిని అనుసరిస్తున్న జననేత చంద్రబాబు. గెలుపోటములనూ ఏనాడు లెక్క చేయని ధీరుడు ఆయన.
మనదేశ రాజకీయ రంగంలో సుస్పష్టమైన ప్రణాళిక,దార్శనికత, ముందుచూపు కలిగిన అతి కొద్ది మంది నాయకుల్లో చంద్రబాబు ఒకరు. విజన్ 2020 పేరుతో నేడు ఇరు తెలుగు రాష్ట్రాలు సాధించబోయే అభివృద్ధికి ఏనాడో బీజాలు వేసిన రాజకీయ మేధావి చంద్రబాబు. 1956 నుండి 2021 వరకు రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ పొలిటిషియన్ చంద్రబాబు.
వెన్ను చూపని ధీరత్వమే 71ఏళ్ల వయస్సులోనూ అలుపెరుగని యోధుడిలా చంద్రబాబును ముందుకు నడుపుతోంది. ప్రజా సంక్షేమంకోసం, రాష్ట్రాభివృద్ధికోసం చంద్రబాబు చేసిన కృషిని, సేవలు వెలకట్టలేనివి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిదేళ్ల పరిపాలనలో,విభజిత నవ్యాంధ్రలో 5 ఏళ్ల పాలనలోగానీ చంద్రబాబుక ప్రత్యేకమైన స్థానం ఉంది. భారతదేశ చిత్రపటంలో ఏపీని అగ్రగామిగా నిలిపిన ఘనత చంద్రబాబుదే.
కష్టాల సుడిగుండంలో ఉన్న నవ్యాంధ్రను ఒడ్డుకుచేర్చడానికి ఒక కర్మ యోగిలా కార్యాచరణతో ముందుకు సాగారు. 71 ఏళ్ల వయసులోను కాళ్ళకి చక్రాలు, కాలానికి రెక్కలు తొడిగిన అలుపెరుగని యోధుడు చంద్రబాబు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం అని నమ్మిన చంద్రబాబు…2019 ఓటమికి కుంగిపోలేదు…ప్రస్తుతం ఉన్న సంకట పరిస్థితికి వెన్ను చూపలేదు. చంద్రబాబు ఓడి పోయారని, వయసైపోయిదని ఎగతాళి చేసి అవమానకరంగా మాట్లాడేవారంతా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏనుగు పడుకొని ఉన్నా అది గుర్రం ఎత్తు ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.
ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ పరిపాలనా తీరును నిశితంగా పరిశీలించినవారికి రాష్ట్ర భవిష్యత్ అగమ్యగోచరం అని అర్థమవుతుంది. సంక్లిష్ట పరిస్థితులు, కరోనా వంటి సంక్షోభాలను సవాళ్లుగా స్వీకరించగల చంద్రబాబు…ఇపుడున్న పరిస్థితుల్లో సీఎంగా ఉంటే ఏపీ పరిస్థితి మరోలా ఉండేదనడంలో ఎటువంటి సందేహం లేదు.
లోటు బడ్జెట్ తో ఉన్న నవ్యాంధ్ర ….నేడు ఇంత ఎత్తుకు ఎదిగిందంటే అది చంద్రబాబు చలవే. కట్టుబట్టలతో నవ్యాంధ్రకు వచ్చిన చంద్రబాబు…ఎన్నో సవాళ్ళ మద్య రాష్ట్రాన్ని ముందుకు నడిపించిన తీరు ఎందరికో ఆదర్శనీయం. కూర్చోవడానికి కుర్చీ లేదు, సమావేశాలకు వేదికలు లేవు.హోటల్లో సమావేశాలు, బస్సులో పడుకొని పరిపాలన సాగించిన కర్మయోగి చంద్రబాబు.
రాజధాని లేదు, ఆర్ధిక వనరులు లేవు, కేంద్ర సాయంలేదు. ప్రతిపక్షాల అడ్డంకులు, ప్రకృతి ప్రకోపాన్ని ఎదుర్కొని మొక్కవోని ధైర్యంతో పోరాడి చీకట్లు నిండిన రాష్ట్రంలో తారాజువ్వలా వెలిగారు చంద్రబాబు. సామాజిక, ఆర్ధిక మానవాభివృద్ది సూచికల ప్రాతిపదికన 2029నాటికి భారత్ లో అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని నిలపాలన్న లక్ష్యంతో అభివృద్ది ప్రణాళికలు రచించారు. ఆ క్రమంలోనే ప్రపంచ స్థాయి రాజధాని అమరావతికి శ్రీకారం చుట్టారు.
కోట్లాది తెలుగు ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా వేగంగా ప్రజా రాజధాని నిర్మాణానికి నడుం బిగించారు.నిర్మాణం అంటే ఇసుక,ఇటుకలు,సిమెంట్ కాదని కోట్లాది ప్రజల ఆకాంక్షలకు ఆకారమని,కలలకు సాకారమని అమరావతి నిర్మాణం సాక్షిగా నిరూపించాలనుకొన్నారు. చంద్రబాబు ఒక్క పిలుపుతో స్పందించిన రైతులు రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు భూములు ఇవ్వడం నభూతో నభవిష్యత్. చంద్రబాబు
చంద్రబాబు పాలనలో నవ్యాoధ్ర అద్భుత ప్రగతి సాధించింది.రాష్ట్రం ప్రపంచంలో ఎట్రాక్టీవ్ సెంటర్ గా,డెస్ట్రినేషన్ సెంటర్ గా ఎదిగింది. సరికొత్త ప్రణాళికలు రచించి,ఆదాయ వనరులు పెంచి,రాష్ట్ర భవిష్యత్ తీర్చిదిద్దడం కోసం చంద్రబాబు చెయ్యని కృషి లేదు. అతి వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను దేశం ముందు నిలిపారు చంద్రబాబు ఆర్ధిక ఇబ్బందులు వెంటాడుతున్నా సంక్షేమ పథకాలు అమలులో దేశంలో ఆంధ్రప్రదేశ్ ని ఆదర్శంగా నిలిపారు.
దశాబ్ధాలుగా కాగితాలకే పరిమితమైన పోలవరం ప్రాజెక్టును 70శాతం పూర్తిచేశారు.నదులు అనుసంధానం అనే ఆదర్సాన్ని నిజం చేసి చూపిన ఒక వజ్ర సంకల్పుడు చంద్రబాబు.ఎత్తిపోతల పధకం ద్వారా నిర్మించిన ఆధునిక దేవాలయం వల్ల పట్టిసీమ పవిత్రమయింది. వరదలా వచ్చిన విదేశీ పెట్టుబడులు,లక్షల మందికి ఉపాధి కల్పన అన్ని ఉంటే పరిశ్రమలు రావడం పెద్ద విషయం కాదు. కానీ అన్ని కోల్పోయన రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు కల్పించి,పరిశ్రమలు ఆకర్షించి,ఉపాధి కల్పించి,అద్భుతాలు సృష్టించడం నవ్యాoధ్రలోనే సాధ్యమైంది.
ఐ టీ అంటే తెలియని రోజుల్లోనే హైదారాబాద్ లో ఐ టి రంగాన్ని అభివృద్ది చెయ్యడం చంద్రబాబుకే సాధ్యమైంది.ఆయన విశేష కృషికి అద్భుతవరం హైటెక్ సిటీ.భారీ వేతనాల తో కూడిన లక్షలాది ఉధ్యోగాలు,ఏటా వేల కోట్ల రూపాయల ఐటి ఎగుమతులు ఈరోజు సాధ్యమవుతున్నాయి అంటే ఆనాటి చంద్రబాబు కృషే కారణం. బెంగుళూరు,ముంభై తో పోటీ పడి ఐటి రంగాన్ని హైదారాబాద్ ఆకర్షించడానికి చంద్రబాబు చొరవే కారణం.ఐటి ఇండియన్ ఆఫ్ ది మిలీనీయంగా ప్రసిద్ది పొందారు.
విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల వల్ల ఎంతో మంది యువతీ,యువకులు విదేశాల్లో స్థిరపడి ఉన్నత స్థానాల్లో నిలబడేలా చేసింది.మహిళా సాధికారత సాధించాలని స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేశారు.చంద్రబాబు చేపట్టిన అనేక సంస్కరణలు,అమలు చేసిన ప్రణాళికలు రాష్ట్రానికి మంచి పేరు తెచ్చి పెట్టాయి.నాడు దూరదృష్టితో చంద్రబాబు నెలకొల్పిన బయోటెక్ పార్క్ నేడు కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసే ప్రక్రియలో భారత దేశాన్ని ముందు వరుసలో నిలిపింది.ఆయన పునాది వేసిన జీనోమ్ వ్యాలీ వైపు దేశమంతా చూసింది.
వినూత్న ప్రణాళికలు రూపొందించడంలో తనకు తానె సాటిఅని నిరూపించుకొన్న కార్యదక్షుడు. తన దార్శనికతతో తెలుగుజాతి భవితను తీర్చిదిద్దడమే కాకుండా సరికొత్త విధానాలతో నవ్య చరిత్రకు నాంధి పలికి దేశ రాజకీయాలలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఒకానొక దశలో చంద్రబాబు ప్రధాని కావాలని పార్టీలన్నీ కోరినా తన రాజకీయ జీవితమే కాదు,తన సేవ కూడా రాష్ట్రానికే అంకితం అని స్పష్టం చేసిన నాయకుడు చంద్రబాబు.
పదవి అంటే అధికారం,అధికారం తెచ్చిపెట్టే అహంకారం,అహంతో వచ్చే తలబిరుసు కాదని,పదవి అంటే బాధ్యత,మరింత వినయంతో కూడిన కర్తవ్యపాలన అని నమ్మే,చేప్పే,ఆచరించే నాయకుడు చంద్రబాబు. ప్రజలే ముందు,ప్రజలే ముఖ్యం అని అధికారులకు చెప్పిన,పాలనలో నియమ నిబంధనలు గురించి చెప్పిన,పాలనలో మానవీయత మరవద్దని చెప్పిన ఆదర్శనాయకుడు చంద్రబాబు.
ఆయన అంకిత భావం,కృషి,పట్టుదల,నిబద్దత,ఆయన క్రాంత దర్శనం అమోఘం.ఆయన అనన్య పాలనా దక్షుడు.చేవగల నేత,గొప్ప సూక్ష్మ గ్రాహి,దార్శనికుడు,అలుపెరుగని కార్య శీలి అయిన చంద్రబాబు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ రాష్ట్రప్రజలు,ప్రపంచ వ్యాప్తంగా వున్న ఆయన అశేష అభిమానులు, టీడీపీ కార్యకర్తల తరపున చంద్రబాబు గారికి ‘నమస్తే ఆంధ్ర‘ 71 వ జన్మదిన శుభాకాంక్షలు.