సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో క్రిస్టియానిటీ పెరిగిపోయిందని, హిందూ దేవాలయాలు, హిందూ ధర్మంపై దాడులు ఎక్కువయ్యాయని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. జగన్ హయాంలోని టీటీడీ పాలక మండలి ప్రతిష్ట మరింత మసకబారిందని, తిరుమలలో అన్యమత ప్రచారం జోరుగా సాగుతోందని తీవ్ర ఆరోపణలు వస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. తిరుమలలో అన్యమత ప్రచారంపై నిషేధం ఉందని, కానీ, అక్కడ క్రైస్తవ మత ప్రచారం జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి.
గతంలో అలిపిరి దగ్గర ఆర్ఎస్ఎస్, బీజేపీ స్టిక్కర్ ఉన్న ఓ భక్తుడి వాహనాన్ని తిరుమల కొండపైకి వెళ్లకుండా పోలీసులు నిలిపివేయడం వివాదాస్పదమైంది. తిరుమలకు వెళ్లే వాహనాలపై హిందూ సంస్థల స్టిక్కర్లు ఉన్నా వాటిని పోలీసులు నిలిపివేయడం చర్చనీయాంశమైంది. తాము వేరే మతాన్ని ప్రచారం చేయడం లేదని, ఫక్తు హిందూ సంస్థనే తిరుమలకు వెళ్లకుండా అడ్డుకోవడంలో ఆంతర్యమేంటని ఆ భక్తుడు ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే తాజాగా తిరుమలలో అన్యమత ప్రచారంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సోము…తిరుమలలో కొందరు అన్యమత ప్రచార ప్రస్తావన, అన్యమత ప్రార్థనల వ్యవహారం తన దృష్టికి తీసుకువచ్చారని షాకింగ్ కామెంట్లు చేశారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో వనరులున్న ఏపీ సరైన దిశలో నడవాల్సిన అవసరం ఉందన్నారు.
జూ.ఎన్టీఆర్కు ప్రజాదరణ ఎక్కువ అని, ఆయన సేవలు ఉపయోగించుకుంటామని సోము అన్నారు. టీడీపీపై తమ వైఖరిలో ఎలాంటి మార్పులేదని అన్నారు. కుటుంబ రాజకీయాలకు, ఫ్యామిలీ పార్టీలకు దూరమని బీజేపీ అధిష్ఠానం చెప్పిందని వ్యాఖ్యానించారు. జగన్ ను టార్గెట్ చేస్తూనే సోము వీర్రాజు అన్యమత ప్రచారంపై వ్యాఖ్యలు చేశారని టాక్ వస్తోంది. తిరుమలలో అన్యమత ప్రార్థనలు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని భక్తులు వాపోతున్నారు. గతంలో కూడా బీజేపీ నేతలు ఈ ఆరోపణలు చేయడంతో టీటీడీ అధికారులు స్పందించారు. తిరుమలలో ఎలాంటి అన్యమత ప్రచారం జరగడం లేదని, అలా జరిగితే ఉపేక్షించబోమని టీటీడీ గతంలో ప్రకటించింది.
Comments 1