తిరుపతి పార్లమెంటు స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ.. ప్రచార జోరును భారీ ఎత్తున పెంచింది. ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగి.. ఎనిమి ది రోజులు మకాం వేసి మరీ.. ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతిలో టీడీపీ పాగా వేస్తుందా? ఆ పార్టీకి ఉన్న సంస్థాగత ఓటు బ్యాంకు పదిలంగానే ఉందా? అసలు తిరుపతి పోరులో టీడీపీ సత్తా ఏంటి? అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి.
తిరుపతి పార్లమెంటు పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా నెల్లూరు జిల్లాలోకి నాలుగు నియోజకవర్గాలు.. చిత్తూరు పరిధిలో మూడు నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ మొత్తం ఏడు నియోజకవర్గాల్లో 3 ఎస్సీ స్థానాలు ఉన్నాయి. గత 2019 ఎన్నికలను తీసుకుంటే.. ఈ ఏడు నియోజకవర్గాల్లోనూ టీడీపీ ఒక్క స్థానం కూడా దక్కించుకోలేక పోయింది. పోటీ చేసిన ఏడు చోట్లా.. టీడీపీ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చింది… కేవలం రెండు స్థానాల్లోనే వీటిలో ఒకటి సర్వేపల్లి(సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి), తిరుపతి(సుగుణమ్మ)లు మాత్రమే.. టీడీపీకి గట్టి పట్టుగా మారాయి. మిగిలిన నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు 25-50 వేల ఓట్ల పైగా తేడాతో ఓడిపోయారు.
2019లో టీడీపీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు
తిరుపతి: 78836
సర్వేపల్లి: 83289
సూళ్లూరుపేట: 58335
సత్యవేడు: 59197
శ్రీకాళహస్తి: 71400
వెంటగిరి: 70484
గూడూరు: 64301
———————
మొత్తం: 4,85,842
———————–
తిరుపతి పార్లమెంటులో టీడీపీకి గత ఎన్నికల్లో పోలైన ఓట్లు: 4,94,501
సో.. ఈ మొత్తాన్ని పరిశీలిస్తే.. టీడీపీకి సంస్థాగత ఓటు బ్యాంకు దాదాపు 5 లక్షల వరకు ఉంది. ఇక, గత ఎన్నికల్లో వైసీపీ దక్కించుకున్న ఓట్లను పరిశీలిస్తే.. కేవలం 25 వేల నుంచి 50 వేల వరకు తేడా ఉంది. అది కూడా జగన్ సునామీ.. జగన్ పాదయాత్ర, చంద్రబాబు పాలనలోని లోపాలు వంటివి పనిచేయగా వచ్చిన ఫలితం.. సో.. ఇప్పుడు ఈ మొత్తాన్ని ప్రభావితం చేయగలిగితే.. టీడీపీ గెలుపు గుర్రం ఎక్కడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఇక, ఇప్పుడు టీడీపీకి కలిసి వస్తున్న అంశం.. నేరుగా చంద్రబాబు రంగంలోకి దిగడం.. సీనియర్ నాయకులు, ఆయన కుమారుడు లోకేష్ కూడా ప్రచారం చేయడం.. కాబట్టి.. టీడీపీకి గెలిచేందుకు అవకాశం ఉందనే అంచనాలు వస్తున్నాయి.