సింగపూర్ లోని సమ్మర్ క్యాంప్ స్కూల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ గాయపడిన సంగతి తెలిసిందే. వెంటనే హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించడంతో మార్క్ కు ప్రమాదం తప్పింది. రెండు రోజుల క్రితం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన మార్క్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ తో పాటు చిరంజీవి దంపతులు కూడా ఇప్పుడు సింగపూర్ లోనే ఉన్నారు. తమ కుమారుడి క్షేమం కోసం ప్రార్థించిన వారందరికీ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.
అయితే అగ్నిప్రమాదం నుంచి పవన్ తనయుడిని కాపాడిన నలుగురు వ్యక్తులకు సింగపూర్ సర్కార్ సత్కరించింది. ఈ నలుగురు భారతీయ వలస కార్మికులే కావడం విశేషం. సింగపూర్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ సమీపంలోని రివర్ వ్యాలీ రోడ్డులో ఉన్న మూడంతస్తుల బిల్డింగ్ లో ఏప్రిల్ 8న అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మొత్తం ఇరవై మంది గాయపడగా.. అందులో 16 మంది చిన్నారులే ఉన్నారు. చిన్నారుల్లో మార్క్ శంకర్ ఒకరు.
బిల్డింగ్ సమీపంలోనే భారత్ నుంచి సింగపూర్ వెళ్లిన నలుగురు వలస కార్మికులు ఇందర్జిత్ సింగ్, నాగరాజన్ అన్బరసన్, శివసామి విజయరాజ్, సుబ్రమణియన్ శరన్రాజ్ లు పని చేస్తున్నారు. ఆ సమయంలో భవనంలోని మూడో అంతస్తు నుంచి పొగలు రావడం, చిన్నారుల అరుపులు, ఏడుపులు వినిపించడంతో నలుగురు కార్మికులు భవనంలోకి పరుగులు పెట్టారు. తమ ప్రాణాలను లెక్కచేయకుండా మంటల్లో చిక్కుకున్న పిల్లలను బయటకు తీసుకొచ్చారు.
సింగపూర్ సివిల్ డిఫఎన్స్ ఫోర్స్ ఘటనా స్థలానికి చేరుకోవడానికి ముందే సగానికి పైగా మంది పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే సదరు భారతీయ వలస కార్మికుల థైర్య సాహసాలను మెచ్చి సింగపూర్ ప్రభుత్వం వారిని సత్కరించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలో నెట్టింట వైరల్ కావడంతో.. ప్రభుత్వం నిర్ణయం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.