కేసుల తీవ్రత పెరుగుతున్న వేళ.. అధికారుల ఆంక్షల నడుమ ఆమె తన పార్టీ (ఇంకా పేరును ప్రకటించలేదనుకోండి) షర్మిల బహిరంగ సభను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె నోటి నుంచి వచ్చిన మాటలు.. చేసిన విమర్శలు అన్ని ‘నోట్’ చేయాల్సిందే. ఎందుకంటే.. రాజకీయాల్లో ప్రతి అంశాన్ని లెక్కలోకి తీసుకోవాల్సిందే. షర్మిల మాటల్నే చూస్తే.. వ్యూహాత్మకంగా వ్యవహరించారనే చెప్పాలి. ఆమె మాటల్ని విన్నంతనే.. చప్పున కేసీఆర్ గుర్తుకు రాక మానదు.
ఆయన పార్టీని పెట్టిన సమయంలో.. టార్గెట్ గా కుంభ స్థలాన్నే ఎంచుకున్నారు. అందుకు నిర్మోహమాటంగా నిందించటం.. ఘాటు విమర్శలకు వెనుకాడకపోవటం కనిపిస్తుంది.
తాజాగా షర్మిల స్పీచ్ చూస్తే.. ఇలాంటివన్నీ కనిపిస్తాయి. కేసీఆర్ కు ఏ మాటలు విన్నంతనే చిరాకుపడిపోతారో.. అవే మాటలు ఆమె నోటి నుంచి రావటం గమనార్హం. బాంచన్ దొర అంటూ జనం బతుకుతున్నారని.. కేసీఆర్ దొర కాలి కింద తెలంగాణ ఆత్మగౌరవం నలిగిపోతుందన్నారు.
ప్రశ్నించే పార్టీలు లేకనే తాను వస్తున్నట్లుగా చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆరు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని.. అందుకే తాను పార్టీ పెడుతున్నట్లు చెప్పారు.
బరాబర్ నిలబడతా.. పోరాడి సాధించుకన్న తెలంగాణలో దగా పడుతున్ ప్రజల కోసం పోరాడతానని షర్మిల మాటల్ని చూస్తే.. కళ్ల ముందు కేసీఆర్ మరో రూపంలో కనిపించారనే చెప్పాలి. మాటల్లో పదును.. తనను విమర్శించన్నప్పటికి తాను మాత్రం విమర్శలు చేసేందుకు ఎలాంటిమొహమాటానికి గురి కానన్న విషయాన్ని తేల్చేలా షర్మిల వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.
ఇదంతా చూస్తే.. కేసీఆర్ తన మాటల్లో ఏదైతే దూకుడుతనాన్ని.. దుందుడుకు తనాన్ని ప్రదర్శిస్తారో అదే తీరును షర్మిల అనుసరిస్తున్నట్లుగా అర్థమవుతుంది. అంతేకాదు.. తన రాజకీయ ప్రత్యర్థుల విషయంలో ఆయన నిర్మోహమాటంగా ఉంటారు. ఎంతమాట అనేందుకైనా వెనుకాడరు. ఇందుకు తగ్గట్లే.. షర్మిల మాటల్లో పదే పదే ‘దొర’ మాటను వాడటం దీనికి నిదర్శనంగా చెప్పక తప్పదు.
కేసీఆర్ కు ఏ మాటలైతే అస్సలు ఇష్టం ఉండదో.. అవే మాటల్ని.. ఇప్పటివరకు ఎవరూ ప్రస్తావించని కొన్ని అంశాల్ని షర్మిల ప్రస్తావించటం ద్వారా.. రానున్న రోజుల్లో తన మాటల తీవ్రత మరింత పెరుగుతుందన్న విషయాన్ని స్పష్టం చేశారని చెప్పాలి. ఇదంతా చూస్తే.. తన రాజకీయ ప్రయాణంలో కేసీఆర్ అనుసరించిన మార్గాన్నే షర్మిల కూడా ఫాలో అవుతున్నారన్న భావన కలుగక మానదు.