ఏపీకి జీవనాడి వంటి పోలవరం జాతీయ ప్రాజెక్టుపై నాటి ప్రతిపక్ష నేత, నేేటి ఏపీ సీఎం జగన్ వైఖరిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు ఒక్కసారి కూడా పోలవరాన్ని సందర్శించేందుకు ఇష్టపడని జగన్….సీఎం అయిన తర్వాత మాత్రం సందర్శించి అందరినీ ఆశ్చర్యపరిచారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు నిర్మిస్తున్న కాలనీలు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని జగన్ చెప్పారు. త్వరలోనే పునరావాస కాలనీలు పూర్తి చేసి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు.
అయితే, వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. పోలవరం నిర్వాసితుల విషయంలో జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. పోలవరం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా, ఆర్ అండ్ ఆర్ కాలనీల నిర్మాణం పూర్తి కాకుండానే నిర్వాసితుల ఇళ్లను అధికారులు ఖాళీ చేయించాలని చూస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పోలవరం నిర్వాసితుల గోడుపై జాతీయ ఎస్సీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కూనవరం, వీఆర్పురం మండలాల్లోని షెడ్యూల్ జాతుల ప్రజలను బలవంతంగా ఖాళీ చేయించడంపై కమిషన్ మండిపడింది. నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా తరలించడంపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, కేంద్ర జలశక్తి కార్యదర్శికి ఎస్సీ కమిషన్ నోటీసులిచ్చింది. పోలవరం నిర్వాసితుల గోడుపై మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన ఎస్సీ కమిషన్ ఈ ప్రకారం నోటీసులిచ్చింది.