ఓపక్క బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య వ్యవహారం అటుఇటు తిరిగి చివరకు డ్రగ్స్ వ్యవహారం వద్దకు ఆగటం తెలిసిందే. డ్రగ్స్ కేసులో బాలీవుడ్ కు చెందిన పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు నటీమణులు.. సెలబ్రిటీలను అధికారులు విచారణకు పిలిపించి.. ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. శాండల్ వుడ్ లోనూ ఇదే తరహాలో డ్రగ్స్ రచ్చ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
డ్రగ్స్ అక్రమ రవాణాలో పాలుపంచుకున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నటీమణులు రాగిణి ద్వివేది.. సంజనా గల్రానిలను ఇప్పటికే బెంగళూరు పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించిన వైనం తెలిసిందే. వెండితెర మీద వెలిగిపోయే ఈ నటీమణులు ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాకు సంబంధించి వారి పాత్ర ఉందన్న విషయాన్ని తెలిపే బలమైన సాక్ష్యాలు తమ వద్ద ఉన్నట్లుగా అధికారులు కోర్టుకు చెప్పారు.
దీంతో.. జైల్లో ఉన్న తమకు బెయిల్ ఇవ్వాల్సిందిగా ఈ ఇద్దరు నటీమణులు కోర్టును కోరారు. దీనికి సంబంధించిన విచారణ తాజాగా సాగింది. ప్రస్తుతం డ్రగ్స్ కేసును ఈడీ అధికారులు విచారణ చేపడుతున్నారని.. ఈ ఇద్దరు నటీమణులకు బెయిల్ ఇప్పిస్తే సాక్ష్యాల్ని నాశనం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక.. ప్రస్తుతం జైల్లో ఉన్న ఇద్దరు నటీమణులు తమకు బెయిల్ ఇవ్వాలని కోరగా.. న్యాయస్థానం వారి వినతిని తోసిపుచ్చింది. దీంతో.. బెయిల్ మీద ఆశలు పెట్టుకున్న వారు షాక్ తినే పరిస్థితి.