అధికారంలో ఉన్నప్పుడు అంతా తాను చెప్పినట్లే జరిగేలా ఆ నాయకుడు చూసుకున్నారు. సర్వస్వం తానే అన్నట్లు బిహేవ్ చేశారు. షాడో సీఎంగా వ్యవహరించారు. పార్టీలో, ప్రభుత్వంలో అంతా తాను చెప్పినట్లే నడుచుకోవాలని ఆధిపత్యం చలాయించారు. కానీ ఇప్పుడు పార్టీ ఓడిపోతే మాత్రం బాధ్యత తనది కాదంటూ తప్పించుకుంటున్నారు. ఆ నేత పేరు సజ్జల రామకృష్ణారెడ్డి. తాజాగా ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ఇతరులను బాధ్యులను చేసి సజ్జల సైడ్ అయిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
వైసీపీ ఓటమిపై జగన్ ఇంకా సమీక్ష చేయడం లేదు. కానీ అప్పుడే సజ్జల డైరెక్షన్లో కొంతమంది వైసీపీ నేతలు సీఎంవో అధికారులను బాధ్యులను చేస్తున్నారే టాక్ వినిపిస్తోంది. అంతా సీఎంవో అధికారులే చేశారని ఈ నాయకులు చెబుతున్నారు. ధనుంజయ్ రెడ్డితో పాటు ఎప్పుడూ జగన్ వెంట ఉండే వైఎన్ఆర్ అనే వ్యక్తిపై నిందలు వేస్తున్నారు. నిజానికి వీళ్లు చేసిందేమీ లేదు. పైనున్న వాళ్లు ఏది చెబితే అదే చేయాలి.
మొత్తం వ్యవహారమంతా సజ్జల క్యాంప్ నుంచే నడిచేదనేది బహిరంగ రహస్యమే. ఆయన చెప్పందే ఏమీ జరగదు. జగన్‌ను ఎమ్మెల్యేలు కలవకుండా చేసేంది కూడా సజ్జలనే అనే అభిప్రాయం ఆ పార్టీ నాయకుల్లోనే ఉంది. కానీ ఇప్పుడేమో ఓటమి నింద తన మీదకు రాకుండా ఇతరుల మీదకు తోసేస్తున్నారనే చెప్పాలి. ఓ వైపు ఓటమికి బాధ్యత జగన్‌దే అంటున్నారు. మరోవైపు సీఎంవో అధికారులు అంటున్నారు. కానీ సజ్జల గురించి మాత్రం ఎవరూ మాట్లాడటం లేదు. సజ్జల పేరు బయటకు రాకుండా ఇప్పటికే వైసీపీ నేతలకు వార్నింగ్ కూడా వెళ్లినట్లు తెలిసింది.