తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గత ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా వ్యవహరించిన సజ్జల రామక్రిష్ణారెడ్డి తాజాగా ఈ కేసు విచారణ కోసం మంగళగిరి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఈ సందర్భంగా మంగళగిరి పోలీస్ స్టేషన్ బయట కాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. అనంతరం ఆయన్ను విచారణకు పిలిచారు.
దాదాపు రెండు గంటల పాటు పోలీసులు వివిధ ప్రశ్నలు వేయగా.. సజ్జల బదులిచ్చారు. పోలీసులు అడిగిన ప్రశ్నల్లో వేటికి సూటిగా సమాధానం ఇవ్వలేదని.. తనకు గుర్తు లేదన్న మాటను ఎక్కువగా వాడినట్లుగా తెలుస్తోంది. విచారణ సమయంలో ఒక ప్రశ్నకు బదులిస్తూ.. టీడీపీ నేత పట్టాభి మాటల్ని విన్నప్పుడు ఆయన్ను తన్నాలని తనకు అనిపించినట్లుగా పేర్కొన్నారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఉదంతం గురించి ఆ రోజు రాత్రికి కానీ తెలియలేదన్న సజ్జల.. మీ ఫోన్ ఇచ్చేందుకు ఎందుకు ఇష్టపడటం లేదన్న ప్రశ్నకు బదులిస్తూ.. అది వ్యక్తిగత స్వేచ్ఛకు ఇబ్బందికి గురి చేస్తుందని చెప్పినట్లు తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా అడిగిన వివిధ ప్రశ్నలకు సూటి సమాధానాలు ఇవ్వలేదని.. ఎక్కువ సందర్భాల్లో తనకు తెలీదని..గుర్తు లేదన్న విషయాన్ని ఎక్కువసార్లు చెప్పినట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం విచారణ వేళ.. సజ్జలను పోలీసులు ఏమని ప్రశ్నించారు? అందుకు ఆయన స్పందన ఏమిటి? అన్న విషయాల్లోకి వెళితే..
టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడిలో మీ పాత్ర లేదంటున్నారు కదా? మీరు ఆ రోజున మీ పార్టీ ముఖ్యనేతలకు పదే పదే ఫోన్ చేసి ఏం మాట్లాడారు? అని అడగ్గా.. ‘తానేం ఫోన్ చేయలేదని.. ఆ టైంలో వైస్సార్ జిల్లా బద్వేలు ఉప ఎన్నిక ప్రచారంలో తాను ఉన్నట్లు సజ్జల చెప్పుకున్నారు. అయినా.. తాము ఏం మాట్లాడుకున్నామో ఆ విషయాల్ని ఎందుకు అడుగుతున్నారు? అని ఉల్టా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
దాడికి ముందు మీ పార్టీ హెడ్డాఫీసులో ఉన్న పలువురు ముఖ్యనేతలతో మాట్లాడిన ఫోన్ కాల్స్ వివరాలు అని విచారణ అధికారి చూపించగా.. ‘‘పార్టీ నాయకులతో మాట్లాడితే తప్పేంటి? మాట్లాడకూడదా?’’ అని రివర్సులో కాస్తంత అగ్రహంతో ప్రశ్నించినట్లు సమాచారం.
దాడిలో పాత్ర లేదన్నప్పుడు.. ఫోన్ ఇవ్వటానికి అభ్యంతరం ఏమిటన్నదానిపై సజ్జల కాస్తంత సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. తన ఫోన్ ఇచ్చేది లేదన్న విషయాన్ని సజ్జల స్పష్టం చేసిన నేపథ్యంలో స్పందించిన దర్యాప్తు అధికారి.. విచారణ మరింత వేగంగా పూర్తి కావటానికి సాయంగా మారుతుందని చెప్పారు.
అయినా.. తన ఫోన్ ఇప్పుడు తన వద్ద లేదని.. తాను నాలుగైదు ఫోన్లు మార్చినట్లుగా చెప్పినట్లు తెలుస్తోంది. ఆ పాత ఫోన్లు ఎక్కడ? అని అడగ్గా.. తనకు గుర్తు లేదని చెప్పినట్లుగా సమాచారం. టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని పార్టీలో కీలక నేతగా ఉన్న మీరు ఎందుకు ఖండించలేదన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పార్టీ ఆఫీసుపై దాడి చేసేందుకుతెలుగుదేశం పార్టీ నేత పట్టాభి మాటలే అంటున్నారు కదా? అని ప్రశ్నించగా.. పట్టాభి మాటలు.. అతడి భాష చాలా జుగుప్పాకరంగా ఉన్నాయని.. ఆ మాటలు విన్న తమ నాయకులు.. కార్యకర్తలకే కాదు నాకూ రక్తం మరిగిందన్నారు. తనకు పట్టాభిని తన్నాలనిపించిందన్నారు. పార్టీ కార్యాలయంపై దాడి చేయటం తప్పని చెబుతున్న మీరే. రక్తం మరిగిందని చెప్పటమేంటి? అనిప్రశ్నించగా.. అంత ఘోరంగా మాట్లాడితే తామెందుకు మౌనంగా ఉండాలి? అని అన్నట్లు తెలిసింది.
టీడీపీ పార్టీ ఆఫీసు దాడి కేసులో వైసీపీ నేతల్ని.. కార్యకర్తల్ని పోలీసులు వేధిస్తున్నారని.. అక్రమ కేసులు పెడుతున్నట్లుగా సజ్జల ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ వారిని వేధించటమే లక్ష్యంగా పెట్టుకుందున్న ఆయన.. ‘నాకు సంబంధం లేకున్నా ఎవరో సహనిందితుడు చెప్పారని నా పాత్ర గురించి పోలీసులే రాసుకొని.. ఈ కేసులో నిందితుడిగా చేర్చి విచారణకు పిలవటం ఏమిటి?’ అని ప్రశ్నించారు.
మరోవైపు.. విచారణ వేళ సజ్జల సహకరించలేదని.. మొత్తం 38 ప్రశ్నలు అడిగితే.. ఎక్కువ వాటికి సమాధానం తెలీదు.. గుర్తులేదు అన్న సమాధానమే ఇచ్చినట్లుగా పేర్కొన్నట్లు చెప్పారు.