“సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి అని ఒకడున్నాడు. అతనొక బ్రోకర్. తాడేపల్లి రాజప్రాసాదం లో కూర్చుని అసెంబ్లీ టికెట్లు అమ్ముకుంటున్నాడు. అతను నా గురించి మాట్లాడతాడా?“ అని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు .. వైసీపీలో రేగిన చిలకలూరిపేట టికెట్ వివాదాన్ని ప్రస్తావించారు. చిలకలూరిపేట ప్రజలు సౌమ్యులు, వారు విజ్ఞులు ఇలాంటి చీట్లపేక ఆడుకునే వారిని వారు తరిమికొడతారు అని అన్నారు.
చిలకలూరిపేట ఎమ్మెల్యే కమ్ మంత్రి విడదల రజనీని నియోజకవర్గాల మార్పులో భాగంగా.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి బదిలీ చేశారు. మంత్రి ఆ నియోజకవర్గానికి బదిలీ అవుతూ… నేను గుంటూరు పోతున్నా, నీకు చిలకలూరిపేట ఇస్తాం అని మల్లెల రాజేశ్ నాయుడుతో చెప్పారు. అతడు వెంటనే పారాచూట్ వేసుకుని దిగిపోయాడు. దీనికి సంబంధించి రూ.6.5 కోట్లతో సెటిల్ మెంట్ చేశారు.
రజనీ సహా గ్రేట్ అడ్వైజర్ సజ్జల రామకృష్నారెడ్డి టికెట్‌ను రూ.6.5 కోట్లకు సెటిల్మెంట్ చేశారు. సజ్జల ఓ బ్రోకర్. చీట్ల పేక ఆడుకునేవాడు.. ఇప్పుడు సినిమా హాళ్ల దగ్గర బ్లాక్ టికెట్లు అమ్ముకున్నట్టు అసెంబ్లీ టికెట్లు అమ్ముకుంటున్నాడు. వీళ్లు నా గురించి, మా పార్టీల పొత్తుల గురించి విమర్శిస్తారా.. అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. అంతేకాదు.. పేట టికెట్ అమ్మిన రాజేశ్ ను కాదని కావటి మనోహర్ అనే వ్యక్తిని చిలకలూరిపేట తీసుకువచ్చారని తెలిపారు.
మనోహర్ కూడా వీళ్లను నమ్ముకుని మరొక పారాచూట్ వేసుకుని పేటకు వచ్చేశాడని చంద్రబాబు ఎద్దేవా చేశారు. మల్లెల రాజేశ్ గొడవ పెట్టుకోవడంతో సెటిల్మెంట్ లో సగం ఇచ్చేశారని, రాష్ట్ర రాజకీయాలు ఎంత దయనీయంగా ఉన్నాయో చూడండి అని చంద్రబాబు వివరించారు. ఇలాంటి వారినిన పేట ఓటర్లు తరిమి తరిమి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. చీట్ల పేకలు ఆడుకునేవారిని రాజకీయాల్లోకి తెస్తే ఇలాంటి పరిస్థితులే ఉంటాయన్నారు.