అల్లోపతిని కించపరిచేలా యోగాగురు బాబా రామ్ దేవ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. అల్లోపతి విధానాన్ని రాందేవ్ బాబా విమర్శిస్తున్నారని, డాక్టర్లను, వైద్య సిబ్బందిని అవమానపరుస్తున్నారని, కించ పరుస్తున్నారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ కూడా బాబా రాందేవ్ కి లీగల్ నోటీసులు పంపాయి.
ఈ క్రమంలోనే తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్లు రాందేవ్ బాబా ప్రకటించారు. తన వ్యాఖ్యల వల్ల ఎవరి మనసులనైనా కష్టపడితే క్షమించాలని కోరారు. అయితే, రాందేవ్ బాబా వివరణ సంతృప్తికరంగా లేదని వైద్యుల సంఘం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే ఐఎంఏకు చెందిన ఉత్తరాఖండ్ వైద్య సంఘం రామ్‌దేవ్ బాబాకు షాకిచ్చింది. రాందేవ్ బాబాకు ఉత్తరాఖండ్ వైద్య సంఘం రూ. 1000 కోట్ల పరువునష్టం నోటీసులు పంపడం సంచలనం రేపింది.
తాను చేసిన వ్యాఖ్యలపై 15 రోజుల్లోగా వీడియో రూపంలో రాందేవ్ బాబా సమాధానం చెప్పాలని, అలాగే, రాతపూర్వకంగా కూడా క్షమాపణలను చెప్పాలని డిమాండ్ చేసింది. అలా చేయని పక్షంలో రూ.1000 కోట్ల పరువునష్టం కోరుతూ కోర్టులో దావా వేస్తామని హెచ్చరించింది. ఈ నోటీసులపై రాందేవ్ బాబా ఎలా స్పందిస్తారన్నదానిపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.
మరో వైపు, బాబా నేతృత్వంలోని పతంజలి యోగా సంస్థ రాందేవ్ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. రాందేవ్ వ్యాఖ్యల తాలూకు వీడియోను ఎడిట్ చేశారని, ఆధునిక సైన్స్ మీద ఆయనకు ఎంతో గౌరవం, విశ్వాసం ఉన్నాయని పతంజతి పేర్కొంది. అల్లోపతిపై బాబాకు ఎలాంటి దురుద్దేశాలు లేవని వివరించింది. రాందేవ్ బాబా పాల్గొన్న ఈవెంట్ లో తనకు అందిన వాట్సాప్ సందేశాన్ని ఆయన చదివారని, అంతే తప్ప ఆయనకు ఆపాదిస్తూ వచ్చిన సమాచారం తప్పుడుదని పేర్కొంది.