రాష్ట్రంలోని ఎస్సీలకు కేటాయించిన నియోజకవర్గాల్లో రెడ్డి సామాజికవర్గం పెత్తనం ఎక్కువగా ఉందా? రెడ్డి వర్గం నేతలు చెప్పిందే అక్కడ నడుస్తోందా? ఇది రాజకీయంగా.. తీవ్ర దుమారానికి వైసీపీ పతనానికి కూడా కారణమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గంలో జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె భర్త సాంబశివారెడ్డి చక్రం తిప్పుతున్నారనేది వైసీపీలోని ఎస్సీ నేతల విమర్శ.
అంతేకాదు.. ఇటీవల జగన్ వరకు కూడా ఫిర్యాదులు వెళ్లాయి. తాము ఎన్నికల సమయంలో పార్టీకి అండ గా ఉంటే.. ఇప్పుడు రెడ్లు తమపై పెత్తనం చేస్తున్నారంటూ.. వారు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేగా ఎస్సీ వర్గానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి ఉన్నారు. కానీ, ఆయనకు స్వేచ్ఛ లేదనేది బహిరంగ రహస్యంగా ఉందని చెబుతున్నారు. దీంతో ఏకంగా ఆయన గుమ్మం కూడా దాటడం లేదు.
మరోవైపు..వచ్చే ఎన్నికల్లో వరప్రసాద్‌కు టికెట్ కూడా ఇచ్చేది లేదని చెప్పడంతో ఎస్సీ వర్గంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదంతా రెడ్డి వర్గం చేస్తున్న కుట్రగా వారు చెబుతున్నారు. ఇక, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కొండపి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ.. వైసీపీకి చెందిన రెడ్డి నేత హవానే నడుస్తోంది. ప్రతి పనికీ.. ఈ కీలకరెడ్డి నేత (అధిష్టానం దగ్గర మంచి పలుకుబడి ఉన్న నాయకు డు.. ఇటీవల కాలంలో వివాదం అయ్యారు) చక్రం తిప్పుతున్నారు.
అదేవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరు సంగతి చెప్పక్కర్లేదు. ఇక్కడ ఎస్సీ నేత ఉన్నా.. రెడ్డి నేతే అన్నీతానై చక్రం తిప్పుతున్నారు. ఇక, ఉమ్మడి కృష్నా జిల్లాలోని తిరువూరు, పామర్రు, నందిగామ నియోజకవర్గాలు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఉమ్మడి గుంటూరు నియోజకవర్గంలోనూ.. కొన్నినియోజకవర్గాల్లో రెడ్డి నేతలు చెప్పిందే జరుగుతోందని.. ఎమ్మెల్యేలు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. మొత్తంగా ఎన్నికలకు ఏడాది ముందు.. సొంత పార్టీలో జరుగుతున్న ఈ అంతర్మథనం .. వైసీపీకి ఇబ్బందిగా మారనుందని అంటున్నారు పరిశీలకులు.