తిరుమల శ్రీవారి ఆలయం వద్ద జరుగుతున్న పరిణామాలు ఇటీవల వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇప్పుడు తాజాగా తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు అవినీతి బాంబు పేల్చారు. తిరుమల కొండపైనంతా ఇప్పుడు అవినీతే రాజ్యమేలుతోందని ఆయన తాజాగా చేసి ట్వీట్ పెను ధుమారం రేపుతోంది.
తిరుమల అధికారుల తీరును ఆయన పరోక్షంగా దుయ్యబడుతూ తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ఘాటు విమర్శలు ఆరోపణలు చేశారు. ”శ్రీవారి ఆలయంలో వివిధ కులాలకు చెందిన 54 కుటుంబాలు వంశపార్యపరంగా సేవలు చేస్తున్నాయి. 30/87 యాక్ట్ తో వీరిని తొలగించారు. ప్రస్తుతం తిరుమలలో అవినీతి రాజ్యమేలతావుంది” అంటూ రమణ దీక్షితులు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి గౌరవ ప్రధానార్చకులు, అర్చకస్వాముల్లో మరోవర్గానికి అధికారులకు మధ్య వివాదాలు రచ్చకెక్కుతూనే ఉన్నాయి. శ్రీవారి ఆలయ ప్రధానార్చకులుగా పనిచేసి ప్రస్తుతం గౌరవ ప్రధానార్చకులుగా కొనసాగుతున్న రమణ దీక్షితులు వంశపారంపర్య అర్చకత్వ హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. గతంలో ఆయన దీనిపై చేసిన వ్యాఖ్యలు పెను ధుమారం సృష్టించాయి.
తిరుమలలో బ్రాహ్మణ వ్యతిరేక శక్తులున్నాయని, వారు ఆలయ సంప్రదాయాలతో పాటు ఆలయ అర్చక వ్యవస్థను నాశనం చేస్తున్నారని, దీనిపైన స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతూ ట్వీట్ చేసి దాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ కు ట్యాగ్ చేశారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో రమణదీక్షితులు ఆలయ ప్రధానార్చకులుగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన్ను ప్రధానార్చకుల పదవి నుంచీ టీడీటీ అధికారులు తొలగించి ఆయన స్థానంలో వేణుగోపాల్ దీక్షితులను నియమించారు. దీనిపైన రమణ దీక్షితులు అటు టీడీపీ ప్రభుత్వంతోనూ ఇటు టీటీడీపైన న్యాయ పోరాటం చేశారు. తరువాత జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆయన సీఎం జగన్ ను కలిశారు. వంశపారంపర్య అర్చకత్వానికి సంబంధించి ఏకసభ్య కమిటీ ఇచ్చిన నివేదికపై ప్రకటన చేయాలని కోరారు. అయితే ప్రభుత్వం నుంచీ అలాంటి స్పందన రాకపోవడంతో ఆయన అసంతృప్తికి లోనయ్యారు.
దీనిపైన ఆయన అప్పట్లో స్పందిస్తూ వంశపారంపర్య అర్చకత్వానికి సంబంధించి ఏకసభ్య కమిటీ ఇచ్చిన నివేదికపైన ప్రకటన చేస్తారని అర్చకులు భావించారని, అయితే దీనిపై ముఖ్యమంత్రి ప్రకటన చేయకపోవడం అర్చకులను తీవ్ర నిరాశకు గురిచేసిందని ట్వీట్ చేశారు. అయితే అనూహ్యంగా కొద్దిసేపటి తరువాత ఆయన ఈ ట్వీట్‌ను ఉపసంహరించుకున్నారు. అయితే అప్పటికే ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిపోయి సంచలనం సృష్టించింది.
అప్పటి నుంచీ కొంతకాలంగా మౌనందాల్చిన రమణ దీక్షితులు ఇప్పుడు తాజాగా తిరుమలలో అవినీతి తాండవం చేస్తోందంటూ చేసిన ట్వీట్ రాజకీయంగానూ ఇటు టీటీడీలోనూ పెను ధుమారం రేపుతోంది.