టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచస్థాయిలో తెలుగోడి సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని నాటు నాటు పాట…ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ కు నామినేట్ కావడంతో తెలుగువారితోపాటు భారతీయులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రాజమౌళి సంతోషం వ్యక్తం చేస్తూ చిత్ర యూనిట్ పై ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
తన సినిమాలో పెద్దన్న (కీరవాణి) తన పాటకు ఆస్కార్ నామినేషన్ పొందారని, ఇంతకంటే ఇంకేం కావాలని రాజమౌళి అన్నారు. ఇప్పుడు తాను తారక్, చరణ్ లను మించిపోయేలా వీరలెవల్లో నాటు నాటు పాటకు డ్యాన్స్ చేస్తున్నానంటూ జక్కన్న హర్షం వ్యక్తం చేశారు. చంద్రబోస్ గారూ కంగ్రాచ్యులేషన్స్… ఆస్కార్ వేదిక మీద మన పాట వినిపిస్తోంది అంటూ అభినందించారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్.. ఈ పాట కోసం మీ కృషి అమూల్యం., మీకు నా వ్యక్తిగత ఆస్కార్ ఇచ్చేస్తాను అంటూ పోస్ట్ చేశారు.
ఈ పాట విషయంలో కాల భైరవ బీజీఎం ఎంతో భరోసా అందించిందని, ఈ పాటను మరింత ముందుకు తీసుకెళ్లవచ్చన్న నమ్మకం కలిగించిందని భైరి బాబుకు థ్యాంక్స్ చెప్పారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మధ్య సమన్వయం, స్టైల్. తమదైన శైలిలో వారు చేసిన డ్యాన్స్ వల్లే ఈ పాట ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను తాకిందని అన్నారు. కానీ, ఆ పాటతోపాటు సినిమా చిత్రీకరణ వేళ తాను పెట్టిన హింసకు వారిద్దరినీ క్షమాపణ కోరుతున్నానని, చాన్స్ దొరికితే వాళ్లిద్దరినీ మరోసారి ఆడుకోవడానికి తాను వెనుకాడనంటూ సెటైర్ వేశారు.
ఆస్కార్ వరకు వెళతానని అనుకోలేదని, నాటు నాటు పాటకు, ఆర్ఆర్ఆర్ కు ఉన్న అభిమానుల వల్లే సాధ్యమైందని అన్నారు. ఈ సందర్భంగా వీరాభిమానులందరికీ కృతజ్ఞతలు చెప్పారు. కార్తికేయ అలుపెరగకుండా పని రాక్షసుడిలా వ్యవహరించాడని, కార్తికేయ లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదని, అతడి పట్ల గర్విస్తున్నానని జక్కన్న అన్నారు. ఆస్కార్ కు మరొక్క అడుగుదూరంలో ఉన్నాం… థాంక్యూ! అని రాజమౌళి చేసిన ఈ పోస్ట్ వైరల్ అయింది.