టాలీవుడ్.. బాలీవుడ్.. ఆ మాటకు వస్తే వుడ్ ఏదైనా.. హీరో ఎవరైనా సరే.. సంచలన దర్శకుడు రాజమౌళి అడగాలే కానీ.. డేట్లు ఇచ్చేయటానికి సిద్ధంగా ఉంటారు. అంతటి క్రేజ్ జక్కన్నసొంతం. అంతేకాదు.. ఏ చిన్న అవకాశం లభించినా.. తమకు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయాలన్న కోరికను బయటపెట్టేస్తుంటారు. దానికి ఎలాంటి మొహమాటానికి గురి కాదు.
రాజమౌళి ఎస్ అనాలే కానీ.. తమ సుడి తిరిగిపోతుందని భావించే హీరోలకు లెక్కలేదు. అయితే.. ఎవరెన్ని కోరుకున్నా.. తాను అనుకున్నది మాత్రమే చేసే రాజమౌళికి.. డ్రీం హీరో అంటూ ఎవరైనా ఉన్నారా? ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలని తపించే హీరోలున్న వేళ.. ఆయనకు ఎవరైనా హీరోతో సినిమా చేయాలన్న కల ఉందా? అన్న సందేహాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. కానీ.. ఇలాంటి ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పింది లేదు.
తాజాగా చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో అలాంటి సందేహాలకు సమాధానాలు చెప్పేశారు రాజమౌళి. వచ్చే నెల తొమ్మిదిన విడుదలయ్యే భారీ బడ్జెట్ మూవీ బ్రహ్మాస్త్ర మూవీకి ప్రమోషన్ చేసే విషయంలో బిజీగా ఉన్న ఆయన.. చెన్నైలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీరు ఫలానా హీరోతో సినిమా తీయాలని అనుకుంటున్నారా? అన్న ప్రశ్నకు బదులిచ్చిన రాజమౌళి అవునని చెబుతూ.. రజనీకాంత్ అంటూ తన మనసులోని మాట చెప్పారు.
సూపర్ స్టార్ రజనీ కాంత్ మూవీకి డైరెక్ట్ చేయాలని తన కలగా చప్పారు. ఆయనతో వర్కు చేయటం తన డ్రీమ్ అన్న రాజమౌళి.. అందుకు సరైన సమయం.. కథ అవసరమన్నారు. ఆ రెండు ఓకే అయితే రజనీకాంత్ తో సినిమా చేయొచ్చని చెప్పారు.
నిజానికి ఈ మాటే ఒక సంచలనంగా చెప్పాలి. అలాంటిది ఈ తరహా ప్రాజెక్టు ఓకే కావాలే కానీ.. ఈ మూవీ మరో సంచలనంగా మారటమే కాదు.. బాక్సాఫీస్ కలెక్షన్లతో షేక్ ఆడటం ఖాయమన్న మాట రజనీ ఫ్యాన్స్ నోటి నుంచి వస్తోంది.