బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు ఎదిగిన అందాల తార ప్రియాంక చోప్రా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ `ఎస్ఎస్ఎంబీ 29`లో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఎంపిక అయింది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లింది. ప్రస్తుతం కెన్యాలో షూటింగ్ జరుగుతోంది.
అయితే రాజమౌళి-మహేష్ మూవీకి ప్రియాంక చోప్రా తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దాదాపు ఏడేళ్ల నుంచి ప్రియాంక హాలీవుడ్ కే పరిమితం అయింది. కనీసం బాలీవుడ్ చిత్రాల్లో కూడా కనిపించడం లేదు. అలాంటి ప్రియాంక చోప్రాను ఒక తెలుగు సినిమాకు రాజమౌళి ఒప్పించారు. పైగా ప్రియాంక నుంచి ఏకంగా 200 రోజుల వరకు డేట్స్ తీసుకున్నారట.
ఇక అందుకు తగ్గట్లుగానే మహేష్ బాబుతో చేయబోయే చిత్రం కోసం ప్రియంకా రూ. 30 కోట్లు పారితోషికం డిమాండ్ చేసిందని ఇన్సైడ్ జోరుగా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి బాలీవుడ్ బ్యూటీల పారితోషికాలే రూ. 20 కోట్లకు మించి లేదు. ఈ లెక్కన చూసుకుంటే ప్రియాంక రికార్డు రెమ్యునరేషన్ తీసుకుంటుందనే చెప్పొచ్చు. కాగా, ఎస్ఎస్ఎంబీ 29 బడ్జెట్ రూ.1200 కోట్ల నుంచి రూ.1500 కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రకు మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్ బ్యాడ్ బాయ్ జాన్ అబ్రహం రేసులో ఉన్నారు.