జాతీయ రాజకీయాల వ్యూహకర్తగా.. 2014లో తెరమీదకు వచ్చిన.. ప్రముఖ ఐఐటీయెన్.. పీకే ప్రశాంత్ కిశోర్.. ఉరఫ్ పీకే.. తర్వా త.. దేశవ్యాప్తంగా ఆయన గుర్తింపు పొందారు. చాయ్ పే చర్చ పేరుతో నిర్వహించిన అప్పటి ఎన్నిక లప్రచారం.. ఊపందుకుని.. గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోడీని దేశానికి ప్రధానిని చేసింది.
ఆ తర్వాత.. ఆయన వ్యూహాలను పలు రాష్ట్రాల్లో.. ప్రతిపక్షాలు కూడా అందిపుచ్చుకున్నాయి. ఏపీలో జగన్ కూడా ఆయన సేవలు వినియోగించుకున్నారు. తర్వాత.. బెంగాల్, బిహార్లలో అధికార పార్టీలు కూడా.. పీకే వ్యూహాలను అందుకుని.. అధికారాలను నిలబెట్టుకున్నాయి.
అయితే.. ఎన్నాళ్లు ఇలా.. పొరుగు పార్టీలకు సేవలు చేసి.. వారికి వీరికి.. అధికారం అందించేలా సేవలు చేస్తామని అనుకున్నాడో ఏమో.. లేక.. తనే స్వయంగా అధికారంలోకి వచ్చేస్తే.. బెటర్ అని భావించాడో తెలియదు కానీ.. తాజాగా పీకే.. తనేస్వయంగా రంగంలోకి దిగిపోయాడు. 3,500 కి.మీ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
మహాత్ముడి జయంతిని పురస్కరించుకుని బిహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో ఆదివారం ఉదయం పాదయాత్రను మొదలుపెట్టారు. రాష్ట్రంలో కొత్త రాజకీయ వ్యవస్థను నెలకొల్పడానికి తన పాదయాత్ర ఉపయోగపడుతుందని పీకే అంటున్నారు.
ఈ యాత్రలో ప్రజల నిర్ణయం మేరకే తన తర్వాతి అడుగులు ఉంటాయని ఆయన చెబుతున్నారు. కానీ, ఆయన వ్యూహం మాత్రం.. పక్కాగా జాతీయ, ప్రాంతీయ రాజకీయాలపై పట్టు సాధించేందుకేనని అంటున్నారు పరిశీలకులు. ‘జన్ సురాజ్’ ప్రచారం కోసం ఆయన పాదయాత్ర ప్రారంభించారు.
ఈ పాదయాత్ర 12 నుంచి 18 నెలల పాటు కొనసాగనుంది. ఎలాంటి విరామం లేకుండా సాగనున్న యాత్రలో ప్రతీ పంచాయతీకి ఆయన వెళ్లనున్నారు. దాదాపు 3,500 కి.మీ ఆయన నడవనున్నారు.
అంతేకాదు.. మహాత్మాగాంధీ జయంతి నాడు ప్రారంభించిన ఈ యాత్ర.. 1917లో మహాత్మాగాంధీ మొదటి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించిన భితిహర్వా నుంచి మొదలు పెట్టడం విశేషం. తద్వారా పీకే.. గాంధేయ వాదులను ఏకంచేసే పనిలో ఉన్నారనే సంకేతాలను ఇచ్చినట్టు అయిందని అంటున్నారు. అదేసమయంలో తటస్థ ప్రజలను కూడా తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.
ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించడానికి ఈ పాదయాత్ర ముందస్తు కసరత్తు అని విశ్లేషకులు చెబుతున్నా.. పీకే మాత్రం ఈ యాత్రలో ప్రజల నిర్ణయం మేరకే తన తర్వాతి అడుగులు ఉంటాయని అంటున్నారు. వెనుకబడిన రాష్ట్రమైన బిహార్లో కొత్త రాజకీయ వ్యవస్థను నెలకొల్పడానికి తన పాదయాత్ర ఉపయోగపడుతుందని పీకే చెబుతున్నారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల మీదుగా తన పాదయాత్ర కొనసాగిస్తానంటూ ట్వీట్ చేశారు.
ముచ్చటగా మూడు లక్ష్యాలు
మూడు లక్ష్యాలతో ప్రశాంత్ కిషోర్ పాదయాత్ర కొనసాగనున్నట్టు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో సరైన వ్యక్తులను గుర్తించడం, వారిని ప్రజాస్వామ్య వ్యవస్థలోకి తీసుకురావడం, వివిధ రంగాల్లో ఉన్న నిపుణుల ఆలోచనలకు ప్రణాళికలు సిద్దం చేయడం వంటి లక్ష్యాలతో పాదయాత్ర సాగుతుందని ఆయన టీం చెబుతోంది.
‘జన్ సురాజ్` రాజకీయ పార్టీ కాదు!
నిజానికి.. కొన్నేళ్ల క్రితమే పీకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. బిహార్లోని అధికార పక్షం జేడీయూ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కానీ ఎక్కువ కాలం కొనసాగలేదు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ జేడీయూ అధిష్ఠానం ఆయన్ను 2020 జనవరిలో బహిష్కరించింది. ఆ తర్వాత పీకే బిహార్ లో ‘జన్ సురాజ్’ పేరుతో ఒక సామాజిక సంస్థను స్థాపించారు. ఈ వేదిక వాస్తవానికి రాజకీయ పార్టీ కాదు. అయినా.. కూడా దీని పేరు మీదే ఆయన ఈ పాదయాత్ర చేపడుతున్నారు. త్వరలోనే దీనిని రాజకీయ పార్టీగా మార్చుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.