ఏపీలో ఎన్నికలు అయిపోయాయి. అయినా.. రాజకీయ వాతావరణం మాత్రం ఎక్కడా చల్లారలేదు. సవా ళ్లు, ప్రతిసవాళ్లు, విమర్శలు ప్రతి విమర్శలు తెర మీదికి వస్తూనే వున్నాయి. దీంతో రాజకీయ పరిస్థితి గందర గోళంగా మారింది. దీంతో ప్రధాన పార్టీలు టీడీపీ , వైసీపీకి చెందిన కీలక నేతలకు కంటిపై కునుకు లేకుండా పోయింది. ఎక్కడ ఏం జరుగుతుందో అని.. నాయకులు నైట్ అవుట్లు చేస్తున్నారు. ఇంకోవైపు పోలీసులు కూడా.. పెద్ద ఎత్తున నిఘా పెంచారు.
ఇదిలావుంటే.. తాజాగా తీవ్ర వివాదానికి కారణమైన మాచర్ల నియోజకవర్గంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు తెరమీదికి వచ్చాయి. ఈ సారి టీడీపీ వంతు వచ్చినట్టుగా ఉంది. ఇటీవల జరిగిన పోలింగ్ సమయంలో జరిగిన ఉద్రిక్తతలలో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి, పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరి రావులు తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రస్తుతం ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకుని రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే.. వీరిని పరామర్శించేందుకు టీడీపీ నేతల బృందాలు విజయవాడ, గుంటూరు, పల్నాడు ప్రాంతాల నుంచి బయలు దేరాయి.
అయితే.. టీడీపీ నాయకులు సైలెంట్‌గా వెళ్లకుండా.. చలో మాచర్ల పిలుపు ఇచ్చారు. అదేమంటే.. బాధితులను పరామర్శించేందుకు అని చెప్పారు. దీంతో అలెర్టయిన విజయవాడ పోలీసు కమిషనర్, గుంటూరు, పల్నాడు ఎస్పీలు.. చలో మాచర్ల కార్యక్రమానికి ఎన్నికల సంఘం నుంచి అనుమతి తెచ్చుకోవాలని.. అప్పటి వరకు జరగనిచ్చేది లేదన్నారు ఈ క్రమంలో వారి మాటలను కూడా వినిపించుకోకుండా.. బయటకు వచ్చిన వారిని హౌస్ అరెస్టు చేశారు. విజయవాడలో అయితే.. ఒక కీలక నేతను ఇంట్లో పెట్టి తాళం వేయడం గమనార్హం. మరి ఇది ఎటు దారి తీస్తుందో చూడాలి.