జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన రసాభాసగా మారిన సంగతి తెలిసిందే. పవన్ ప్రజావాణి కార్యక్రమానికి అనుమతిని పోలీసులు నిరాకరించడం, ఆయనను హోటల్ గదికే పరిమితం చేయడం, కొందరు జనసేన కార్యకర్తలను అరెస్టు చేయడం వంటి పరిణామాలతో విశాఖ తీరం రాజకీయంగా ఉగ్రరూపం దాల్చింది. ఈ క్రమంలోనే తాజాగా పవన్…విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో నేడు విజయవాడకు బయలుదేరారు.
అయితే, విశాఖలో పరిణామాల నేపథ్యంలో పవన్ విజయవాడ చేరుకోగానే జనసైనికులు భారీగా తరలివచ్చే అవకాశముండడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు, విశాఖ పర్యటనలో అడ్డంకులపై గవర్నర్ హరిచందన్ కు పవన్ ఫిర్యాదు చేయబోతున్నారట. ఆల్రెడీ గవర్నర్ అపాయింట్ మెంట్ కోరగా..రిప్లై రాలేదని తెలుస్తోంది. ఇక, విశాఖలోని పరిణమాాలపై పవన్ న్యాయపోరాటం చేయడానికి రెడీ అవుతున్నారట. ఈ క్రమంలోనే పవన్ ఒక వీడియో సందేశం విడుదల చేశారు.
115 మంది జనసైనికులపై హత్యాయత్నం కేసులు పెట్టారని, జనసేన లీగల్ సెల్ రాష్ట్ర కమిటీ చైర్మన్ సాంబశివ ప్రతాప్ తో ఈ విషయంపై చర్చిస్తామని పవన్ అన్నారు. కొంతమందికి స్టేషన్ బెయిల్ రాగా, మిగతావారికి బెయిల్ తెచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తమ పోరాటం ప్రభుత్వంపై అని, పోలీసులపై కాదని పవన్ అన్నారు. హోటల్ బయట ఉన్న వందలాది మంది జనసైనికులు, అభిమానులకు అభివాదం చేసేందుకు కూడా పోలీసులు చాన్స్ ఇవ్వలేదని పవన్ వాపోయారు.
ఈ తరహా ఆంక్షలు భవిష్యత్తులో విధించకుండా ప్రభుత్వాన్ని నియంత్రించేలా న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. ఈ విషయంపై న్యాయనిపుణులతో చర్చించి హైకోర్టులోనూ పిటిషన్ వేసే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. విశాఖను వీడే ముందు జైలు నుంచి విడుదలైన జనసేన నేతలను పవన్ పరామర్శించారు.