ఈ నెల 11వ తేదీన విశాఖలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రా యూనివర్సిటీలో మోడీ పర్యటన సందర్భంగా బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. విశాఖలో పలు అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపన చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే, విశాఖ టూర్ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మోడీ భేటీ కాబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
ఇటీవల విశాఖలో పవన్ ను పోలీసులు అడ్డుకోవడం, ప్రజావాణి కార్యక్రమాన్ని నిలిపివేయడం వంటి వ్యవహారాలపై కూడా పవన్…మోడీకి ఫిర్యాదు చేయబోతున్నట్టుగా పుకార్లు వస్తున్నాయి. అంతేకాదు, ప్రధాని బహిరంగ సభకు పవన్ కళ్యాణ్ ని కూడా కేంద్ర వర్గాలు ఆహ్వానించబోతున్నాయని తెలుస్తోంది. గతంలో అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పవన్ కు ఆహ్వానం అందినప్పటికీ ఆయన హాజరు కాలేదు. అయితే, ఇటీవల బీజేపీపై పవన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర పెద్దలు కూడా పవన్ ను కలుపుకు ముందుకు పోయేందుకు ప్రయత్నిస్తున్నారట.
ఈ నేపథ్యంలోనే విశాఖలో పవన్ తో మోడీ భేటీ అయి…ఏపీలో జనసేన, బిజెపిల భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. బిజెపి అంటే తనకు గౌరవం ఉందని, కానీ రూట్ మ్యాప్ ఇవ్వడంలో జాప్యం వల్లే తాను బిజెపితో పూర్తి స్థాయిలో కలిసి ముందుకు సాగలేక పోతున్నానని పవన్ చేసిన వ్యాఖ్యలను బిజెపి పెద్దలు సీరియస్ గా తీసుకున్నారట. ఈ క్రమంలోనే పవన్ తో మోడీ భేటీ అయి ఆయనను బుజ్జగించే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రచారం నేపథ్యంలోనే జగన్ టెన్షన్ పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్న బిజెపి…ఇటు జనసేనతోను అటు టిడిపితోనూ స్నేహ హస్తం చాచడంతో జగన్ ఇరకాటంలో పడ్డట్టుగా తెలుస్తోంది. మరి విశాఖ టూర్ లో పవన్ తో మోడీ భేటీ అవుతారా ఒకవేళ ఆ సభకు పవన్ హాజరైతే జగన్ స్పందన ఏవిధంగా ఉంటుంది అన్నది హాట్ టాపిక్ గా మారింది.