రాష్ట్రం కోసమే పొత్తు పెట్టుకున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు. రాష్ట్రాన్ని బంగారు పథంలో నడిపించాలని తపిస్తున్నానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే తాను చేతులు కలిపినట్టు, టీడీపీతో కలిసి నడుస్తున్నట్టు వివ రించారు. బీజేపీ ఆశీస్సులు తమకు ఉన్నాయని చెప్పారు. `ఇప్పటం` ఘటన నుంచి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నామని పవన్ పేర్కొన్నారు. వైసీపీ విముక్త రాష్ట్రం లక్ష్యంగా అడుగులు పడుతున్నాయని చెప్పారు. బీజేపీ కోసమే తన సీట్లను తగ్గించుకున్నానని పవన్ వెల్లడించారు.
వచ్చే ఎన్నికలు అత్యంత కీలకమని వెల్లడించిన పవన్ కళ్యాణ్.. ప్రతి సీటు, ప్రతి ఓటు.. చాలా ముఖ్యమ న్నారు. “ఎక్కువ సీట్లు తీసుకుని ఏదో చేయాలని నాకు లేదు. 98 శాతం అవకాశాల కోసం నేను 24.. ఎమ్మెల్యే 3 పార్లమెంటు స్థానాలు తీసుకున్నా. ఇప్పటికే చాలా వరకు రాష్ట్రం నష్టపోయింది.. అందుకే కొన్ని త్యాగాలకు సిద్ధమయ్యాం“ అని పవన్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కోసం కూడా కొన్ని సీట్లు కుదించుకున్నామన్నారు.
79 సీట్లు తీసుకోవాలనిఅన్ని వర్గాల నుంచి తనపై ఒత్తిడి వచ్చిందని పవన్ చెప్పారు. అయితే.. ఇన్ని సీట్లు తీసుకుని.. దీని కోసం పోరాటం చేసి, మొహమొహాలు చూసుకోకుండా తిరిగి ఏం చేస్తాం.. అని వ్యాఖ్యానించా రు. ఇలా తీసుకున్నా.. పోటీ చేసినా.. ప్రయోజనం ఉండదన్నారు. గతంలో తనకు పది సీట్లు గెలిపించి ఉంటే బాగుండేదన్నారు. కాబట్టి ఇప్పుడు జనసేన, టీడీపీ ఓట్లు కరెక్ట్‌గా ట్రాన్సఫర్ అవ్వాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
ఎన్నికల ఘట్టం పూర్తికాగానే.. టీడీపీ-జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని చెప్పారు. ఎట్టి పరిస్థితిలోనూ గెలుస్తున్నామని పవన్ వెల్లడించారు. “జగన్ సిద్ధం.. సిద్ధమని చావ గొడుతున్నాడు. మేం తప్పకుండా యుద్ధం చేసి విజయం సాధిస్తాం. ఈ రాక్షస రాజ్యాన్ని తరమికొట్టి ప్రజలకు, రాష్ట్రానికి మేలు చేయడమే మా పార్టీల కలయిక లక్ష్యం“ అని జనసేనాని వ్యాఖ్యానించారు.