శబరిమల కొండ మీద ఆ ఇద్దరి మీద అభిమానాన్ని చూపించిన స్వాములు
తాము అభిమానించే వారి మీద కొండంత అభిమానాన్ని ప్రదర్శించే వాళ్లు ఉంటారు. కొందరు మాత్రం తమకున్న అభిమానాన్నిబయటపెట్టేందుకు అస్సలు వెనుకాడరు. వెండితెర మీద పవర్ స్టార్.. రియల్ లైఫ్ లో జనసేన అధినేతగా వ్యవహరించే పవన్ కల్యాణ్ కు డైహార్ట్ ఫ్యాన్స్ కు కొదవ లేదు. ఆయన్ను ఎంతలా అభిమానిస్తారో.. మరెంతలా ఆరాధిస్తారో తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ హీరోలు ఎంతమంది ఉన్నా.. పవన్ ఫ్యాన్స్ కాస్తంత భిన్నమని చెబుతారు. ఆయన్ను పర్సనల్ గా తీసుకునేటోళ్లు ఎంతో మంది.
జనసేన అధినేతగా ఏపీలో అధికారాన్ని సొంతం చేసుకోవాలని.. ఏపీని ముందుకు తీసుకెళ్లేందుకు తన శక్తిసామర్థ్యాల్ని వినియోగిస్తున్న ఆయన్ను అమితంగా ఆరాధించే వాళ్లకు కొదవ లేదు. తాజాగా పవన్ మీద అభిమానాన్ని శబరిమలకు వెళ్లిన స్వాముల రూపంలో బయటకు వచ్చింది. గుంటూరు జిల్లాకు చెందిన కొందరు తాజాగా అయ్యప్ప దర్శనానికి శబరిమలకు వచ్చారు. వారి చేతిలో జనసేన జెండా ఉంది. వారి ఆకాంక్ష పవన్ కల్యాణ్ ఏపీకి ముఖ్యమంత్రి కావటమే.
జనసేన జెండాను పట్టుకొని శబరిమల సాక్షిగా తమకున్న ఆకాంక్షను వ్యక్తం చేసిన స్వాముల తీరు ఇప్పుడు వైరల్ గా మారింది. శబరిమల కొండను ఎక్కే వేళలో స్వామి చేతిలో జనసేన జెండా ఉండటం గమనార్హం. మరోవైపు..ఇంతే అభిమానాన్ని కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ పట్ల ప్రదర్శించారు ఆయన అభిమానులు. అనూహ్యంగా కాలం చేసిన ఆయన మీద తమకున్న అభిమానాన్ని ప్రతి సందర్భంలోనూ ప్రదర్శించే అభిమానులు.. ఒక స్వామి శబరిమల కొండ మీద.. పునీత్ ఫోటోతో కలిసి అయ్యప్ప స్వామిని దర్శించుకోవటం చూస్తే.. ఆయనంటే ఎంత అభిమానం అన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు.
కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఈ అభిమాని పేరు రమన్ కుమార్ అని చెబుతున్నారు. శబరిమల కొండ మీద ఏపీకి చెందిన పవన్ కల్యాణ్ మీదా.. కర్ణాటకకు చెందిన పునీత్ మీదా ఆయన అభిమానులు తమకున్న ప్రేమాభిమానాల్ని ప్రదర్శించారని చెప్పాలి.