పుర్రెకో బుద్ధి…జిహ్వకో రుచి అన్నారు పెద్దలు…జిహ్వ చాపల్యాన్ని పక్కనబెడితే చాలామంది పుర్రెలో పుట్టిన ఆలోచన కోసం ఏమైనా చేస్తారు. కొంతమందికి జాతకాలు అంటే విపరీతమైన నమ్మకం..మరి కొందరికి న్యూమరాలజీ అంటే మంచి గురి గురి. అందుకే, వారు తమకు సంబంధించిన లక్కీ నంబర్ అన్ని విషయాల్లోనూ వచ్చేలాగా చూసుకుంటూ ఉంటారు. తమ వాహనాలకు సంబంధించిన నెంబర్ ప్లేట్ కావచ్చు… లేదంటే తమ మొబైల్ నెంబర్ లోని అంకెలు కావచ్చు.
అందుకే ఇటువంటివారంతా తమకు నచ్చిన ఫ్యాన్సీ నెంబర్ కొనుగోలు చేసేందుకు ఎంత ఖర్చు పెట్టేందుకైనా వెనకాడరు. ఈ క్రమంలోనే తనకు కావాల్సిన ఫ్యాన్సీ నెంబర్ కోసం హిమాచల్ ప్రదేశ్ లో ఒక వ్యక్తి అక్షరాలా కోటి రూపాయలు ఖర్చు చేశాడు. నెంబర్ ప్లేట్ కోసమే కోటి పెట్టాడు అంటే అతడు కొన్న బండి ఖరీదు కనీసం మూడు నాలుగు కోట్లు ఉంటుంది అనుకుంటే ఒక కాలు పప్పులో మరో కాలు తప్పులో వేసినట్టే!
సదరు వ్యక్తి కోటి పెట్టి మరీ ఏరి కోరి ఆ నెంబరు కొన్నది లక్ష రూపాయల విలువ చేసే స్కూటీ కోసం. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో HW999999 నంబర్ ను రవాణా శాఖ అధికారులు వేలానికి ఉంచారు. ఈ నెంబర్ కనీస ధరను రూ.1000గా నిర్ణయించారు. అయితే, ఈ నెంబర్ ను దక్కించుకునేందుకు చాలామంది ఔత్సాహికులు బిడ్డింగ్ లో పాల్గొన్నారు. ఇటీవల, లక్ష రూపాయలు పెట్టి స్కూటీ కొన్న ఆ వ్యక్తి ఈ ఫ్యాన్సీ నెంబర్ కోసం కోటి రూపాయలు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఈ నెంబర్ కు ఇంత పెద్ద మొత్తం బిడ్డింగ్ లో రావడంతో అధికారులు కూడా అవాక్కయ్యారు.