ఆరు జిల్లాల్లో ఒక్క ఓటు కూడా పడలేదు…పట్టు పట్టడం.. అన్న మాట వింటాం. రాజకీయాల్లో అయితే.. మరీ ఎక్కువగానే ఈ మాట వినిపిస్తుంది. కానీ, పరిస్థితులకు అనుగుణంగా.. పట్టును సడలించే పరిస్థితి కళ్లముందు కనిపిస్తూనే ఉంది. ఇక, సుదీర్ఘ సమస్యలు ఎదుర్కొంటున్న రాష్ట్రాలు కూడా.. ముందు పట్టుబట్టడం.. తర్వాత.. కేంద్రం ముందు సాగిలపడడం మనకు తెలిసిందే. సర్దుకుపోవడం కూడా అనుభవమే. కానీ.. మంచో చెడో.. అక్కడి ప్రజలు పట్టుబట్టారు. ఓటింగ్‌లో పాల్గొనేది లేదన్నారు. కానీ, నాయకులు లైట్ తీసుకున్నారు. ఇది సాధారణమేలే.. ఈ ఆవేశం ఎన్నో నాళ్లు ఉండదులే అనుకున్నారు. కానీ, వారికి ఆ రాష్ట్ర ప్రజలు భారీ షాక్ ఇచ్చారు. పట్టుదల కసి.. ఎలా ఉంటుందో రుచి చూపించారు.
విషయం ఇదీ..
నాగాలాండ్‌లో ఒకే ఒక్క లోక్‌సభ స్థానం ఉంది. తాజాగా గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల తొలిదశలోనే ఈ రాష్ట్రంలోని ఒక స్థానానికి ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించింది. అయితే.. ఆరు జిల్లాల్లో ఒక్కటంటే ఒక్క ఓటు కూడా పడలేదు. వాస్తవానికి 13 లక్షలకుపైగానే ఓటర్లు ఉన్న నాగాలాండ్‌లో ఈ ఆరు జిల్లాల్లో ఏకంగా 4 లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. కానీ, ఒక్కరంటే ఒక్కరు కూడా ఓటేసేందుకు ముందుకు రాలేదు. మధ్యాహ్నం 1గంట వరకు వేచి చూసిన పోలింగ్ సిబ్బంది.. ఇంటింటికీ వెళ్లి తలుపు తట్టారు. అయినా.. ప్రజలు రాలేదు. దీంతో చేసేది లేక.. వెనుదిరిగారు. ఈ దేశ చరిత్రలో సార్వత్రిక ఎన్నికల్లో 6 జిల్లాల ప్రజలు, 4 లక్షల ఓటర్లు ఇలా ఓటింగ్‌కు దూరంగా ఉండడం ఇదే తొలిసారి.
ఏం జరిగింది?
ఈశాన్య నాగాలాండ్ ప్రాంతంలోని ఆరు జిల్లాల(మాన్, ట్యున్శాంగ్, లాంగ్లెంగ్, కిఫిరే, షమాతోర్, నాక్లాక్) ప్రజలు.. కొన్ని దశాబ్దాలుగా.. తమను ప్రత్యేక రాష్ట్రం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిసారీ ఎన్నికల్లో ఇదే నినాదం కూడా వినిపించారు. అయితే.. ప్రతి సారీ అన్నిపార్టీలు.. తప్పకుండా ప్రత్యేక రాష్ట్రం చేస్తామని హామీ ఇవ్వడం.. తర్వాత మరిచిపోవడం కామన్‌గా మారిపోయింది. అయితే.. ఈ సారి కూడా ఇదే నినాదం వినిపించిన ప్రజలు.. `ఈశాన్య నాగాలాండ్ ప్రజా సంస్థ`గా ఏర్పడ్డారు. దీనిపై డిమాండ్‌ను బాగానే వినిపించారు. తమకు రాష్ట్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తేనే ఓటేస్తామన్నారు.
కానీ, నాయకులు మాత్రం .. ముందు గెలిపించండి .. తర్వాత చూసుకుందాం అన్నారు. అంతే! పట్టుబట్టిన ప్రజలు ఎన్నికల్లో ఓటు వేయకుండా భీష్మించారు. దీంతో ఏకంగా ఆరు జిల్లాల్లో ఒక్కటంటే ఒక్క ఓటు కూడా పడలేదు. నాయకులు బ్రతిమాలినా.. అధికారులు విన్నవించినా.. ఇక్కడి ప్రజలు పట్టు వీడలేదు. దీంతో ఎన్నికల సంఘం మౌనం వహించింది. ఇదీ.. సంగతి!! పట్టుదల అంటే ఇలా ఉంటుందా? అని అనిపించేలా ఇక్కడి ప్రజలు వ్యవహరించడం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.