గత డిసెంబరులో భారీ స్థాయిలో విడుదలైన ‘పుష్ప: ది రూల్’ మూవీ ఇండియన్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఇండియాలోనే కాక అనేక దేశాల్లోనూ ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. దీనికి కొనసాగింపుగా మూడో పార్ట్ ఉండబోతోందంటూ సినిమాలో హింట్ కూడా ఇచ్చారు.‘పుష్ప: ది రాంపేజ్’ అంటూ దానికి టైటిల్ కూడా పెట్టేశాడు సుకుమార్. కానీ నిజంగా ఆ సినిమా ఉంటుందా అనే సందేహాలు కలిగాయి.
‘పుష్ప-3’ గురించి సుకుమార్ మాట్లాడుతూ..బన్నీ డేట్లు ఇస్తే చేస్తా అన్నాడు. బన్నీ ఏమో.. ‘పుష్ప-3’ ఏంటో మీకూ తెలియదు, నాకూ తెలియదు అంటూ మరో సందర్భంలో సుకుమార్‌ను ఉద్దేశించి మాట్లాడారు. ఇద్దరూ వేర్వేరు కమిట్మెంట్లతో బిజీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ఉండదని.. ఉన్నా ఇప్పుడిప్పుడే కాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
కానీ ‘పుష్ప’, పుష్ప-2’ చిత్రాలను నిర్మించిన మైత్రీ సంస్థ అధినేతల్లో ఒకరైన రవిశంకర్ మాత్రం ‘పుష్ప-3’ రిలీజ్ గురించి ఒక ఆసక్తికర స్టేట్మెంట్ ఇచ్చారు.
తమ ప్రొడక్షన్ నుంచి వస్తున్న కొత్త చిత్రం ‘రాబిన్ హుడ్’ ప్రమోషన్లలో భాగంగా విజయవాడలో జరిగిన ప్రెస్ మీట్లో రవిశంకర్..‘పుష్ప-3’ గురించి మాట్లాడారు. ఈ సినిమా కచ్చితంగా ఉంటుందని చెప్పడమే కాక.. 2028లో రిలీజ్ అంటూ పెద్ద స్టేట్మెంటే ఇచ్చారు. పుష్ప-1 సినిమాను రెండేళ్లకు పైగా తీసిన సుకుమార్.. పుష్ప-2 కోసం మూడేళ్లు వెచ్చించాడు. మరి ‘పుష్ప-3’ తీయడానికి ఇంకెన్నేళ్లు పట్టాలి? రవిశంకర్ చెబుతున్నట్లు 2028లో రిలీజ్ చేయాలి అంటే వెంటనే ఈ సినిమాను పట్టాలెక్కించాలి.
కానీ ప్రస్తుతానికి సుకుమార్ దగ్గర కథ లేదు. పైగా మధ్యలో సుకుమార్, బన్నీ మినిమం ఒక్కో సినిమా అయినా చేయాల్స ఉంది. కాబట్టి ఈ సినిమా నిజంగా చేసేట్లున్నా అది రావడానికి ఇంకో ఐదేళ్లయినా పట్టొచ్చు. ఇదిలా ఉండగా.. అట్లీ దర్శకత్వంలో బన్నీ సినిమా చేయబోతున్న విషయాన్ని ఈ ప్రెస్ మీట్లో రవిశంకర్ కన్ఫమ్ చేయడం విశేషం.