2023లో భారత్ లో జరిగిన వన్డే క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ను క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరచిపోలేరు. సొంతగడ్డపై జరుగుతున్న మెగా టోర్నీలో ఓటమి ఎరుగని జట్టుగా ఫైనల్లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియాను ఆస్ట్రేలియా ఓడించి కప్ ఎగరేసుకుపోయింది. ముఖ్యంగా ఫైనల్లో ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ విధ్వంసకర ఇన్నింగ్స్ తో భారత్ పతనాన్ని శాసించడం భారత అభిమానులకు ఓ పీడకలగా మిగిలిపోయింది.
కట్ చేస్తే…తాజాగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్లో మరోసారి ఆసీస్ తో అమీతుమీ తేల్చుకోవడానికి భారత్ రెడీ కాగా..ఈ సారి ఆసీస్ ను ఓడించి పగ తీర్చుకోవాలని భారత అభిమానులంతా కోరుకున్నారు. ఆ కోరికకు తగ్గట్లే కంగారూలను మట్టి కరిపించిన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు దూసుకువెళ్లింది.
4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఆసీస్ కు నాకౌట్ పంచ్ ఇచ్చింది. ఛేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ తన మార్క్ ఇన్నింగ్స్‌తో తన జట్టును విజయ తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ డూ ఆర్ డై మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ కు దిగి 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ స్టీవ్ స్మిత్, అలెక్స్ కేరీ హాఫ్ సెంచరీ చేశారు. 33 బంతుల్లో 39 పరుగులు చేసి ప్రమాదకరంగా కనిపిస్తున్న హెడ్ ను మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఔట్ చేసి ఆసీస్ ను ఆదిలోనే దెబ్బకొట్టాడు. షమీ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, జడేజా 2 వికెట్లతో రాణించారు.
టర్నింగ్ పిచ్ పై భారత్ త్వరగా 2 వికెట్లు కోల్పోయింది. దీంతో, భారత అభిమానుల్లో టెన్షన్ ఏర్పడింది. అయితే, ఛేజింగ్ లో అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉన్న కోహ్లీ(84)..అయ్యర్ తో కలిసి మరో వికెట్ పడకుండా ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. అయ్యర్(45), కేఎల్ రాహుల్(42), హార్దిక్(28) లు కూడా తమ పాత్ర సమర్థవంతంగా పోషించడంతో 48.1 ఓవర్లలో భారత్ లక్షాన్ని ఛేదించి ఫైనల్లో అడుగుపెట్టింది. మార్చి 9న దుబాయ్ వేదికగా టైటిల్ పోరు జరగనుంది. బుధవారం న్యూజిలాండ్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే రెండో సెమీస్ విజేత ఫైనల్ లో భారత్ తో తలపడనుంది.