మాటలు చెప్పటం వేరు. చేతల్లో చూపించటం వేరు. ఆదర్శాలు సవాలచ్చ చెప్పినా.. వాటిని ఆచరణలో చేసి చూపించటం అంత తేలికైన విషయం కాదు. మిగిలిన వారికి భిన్నంగా ఒక రాష్ట్ర స్పీకర్ వ్యవహరించిన తీరు ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. అందరూ ఆయన్ను అభినందిస్తున్న పరిస్థితి. గాంధీగిరి అనే మాటకు నిలువెత్తు రూపంగా ఆయన తాజా చర్యను అభివర్ణిస్తున్నారు.
స్పీకర్ హోదాలో ఉండి.. ఒక ఎమ్మెల్యే తీరును మార్చేందుకు వ్యవహరించిన తీరును ప్రశంసిస్తున్నారు. ఇంతకూ ఆయన ఎవరంటారా? ఉత్తరప్రదేశ్ స్పీకర్ సతీశ్ మహానా.
అసెంబ్లీ ప్రధాన హాలు ప్రవేశ ద్వారం వద్ద కార్పెట్ పై ఒక ఎమ్మెల్యే పాన్ మసాలా ఉమ్మివేయటాన్ని స్పీకర్ సతీష్ తీవ్రంగా పరిగణించారు. ఇలాంటి చర్యలు అడ్డుకోవాలని.. సభా గౌరవాన్ని కాపాడాలన్న ఆయన.. అనూహ్య చర్యకు దిగారు. మంగళవారం ఉదయం సెషన్ ప్రారంభమైన వేళ స్పీకర్ మాట్లాడుతూ.. గౌరవ సబ్యుల్లో ఒకరు విధానసభ హాల్ లో పాన్ మసాలా ఉమ్మి వేశారన్నారు.
సదరు సభ్యులు ఎవరో తనకు తెలుసన్న స్పీకర్.. తాను ఆయన పేరును బహిరంగంగా చెప్పదలుకోలేదని.. ఎవరిని కించపరిచే ఉద్దేశం తనకు లేదన్నారు. అందుకే.. సదరు సభ్యుడు తనంట తానుగా వచ్చి తనను కలవాలన్నారు. లేకుంటే తాను బలవంతంగా పిలిపించాల్సి వస్తుందన్నారు. అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద సదరు ఎమ్మెల్యే పాన్ మసాలాను ఉమ్మివేసిన విషయాన్ని తాను తెలుసుకున్నట్లు చెప్పారు.
తనకు ఈ సమాచారం అందిన వెంటనే.. తాను స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్లి.. శుభ్రం చేశానన్నారు. అసెంబ్లీ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం సభ్యులందరి బాధ్యతగా పేర్కొన్నారు. పాన్ ఉమ్మిన ఎమ్మెల్యేకు కార్పెట్ మార్చటానికి అయ్యే ఖర్చును భరించాలని.. ఆ డబ్బుల్ని చెల్లించాలన్నారు. గాంధీగిరి అన్న మాటకు యూపీ స్పీకర్ చర్య అర్థం చెప్పినట్లుగా చెబుతున్నారు. మరి.. సదరు సభ్యుడు స్పీకర్ ను కలిసి చెంపలేసుకున్నారా? లేదా? అన్నది బయటకు రావాల్సి ఉంది.